Andhrabeats

అమరావతిలో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం !

Andhra Cricket Association Stadium in Amaravathi

రాజధాని నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పోర్ట్స్‌ సిటీలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియం నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించింది. అమరావతి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి ఐసీసీ అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ కేశినేని చిన్ని ఈ విషయాన్ని వెల్లడించారు. అమరావతిలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియానికి ఐసీసీ ఛైర్మన్‌ జైషా అనుమతి ఇచ్చినట్లు కేశినేని శివనాథ్‌ వెల్లడించారు. రెండు నుంచి రెండున్నర ఏళ్ల లోపల పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌ అభివృద్ధికి బీసీసీఐ సహకారం అందిస్తుందని కేశినేని చిన్ని వివరించారు.

మరోవైపు రాష్ట్రంలోని రెండు క్రికెట్‌ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు కేశినేని చిన్ని తెలిపారు. విజయనగరం, ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడులో క్రికెట్‌ అకాడమీలను పెడుతున్నట్లు వివరించారు. ఇక విశాఖపట్నంలోని ఏసీఏ – వీడీసీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో రెండు నెలల్లోనే మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు తెలిపారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల తర్వాత స్టేడియంలోని ఎలివేషన్‌ పనులు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 30 మైదానాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేశినేని చిన్ని వివరించారు.

మనదేశంలో ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియం దేశంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందింది. అయితే ఈ స్టేడియాన్ని మించేలా లక్షా 32 వేల సీటింగ్‌ సామర్థ్యంలో అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అమరావతిలో 60 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఏసీఏ కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతిలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్‌ సిటీ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులోనే అమరావతి స్టేడియం నిర్మించాలని ఏసీఏ భావిస్తోంది.

TOP STORIES