అమెరికా వెళ్లాలనుకొనే భారతీయులకు వీసా అపాయింట్‌మెంట్‌పై కొత్త నిబంధనలను అమలుచేయనున్నట్టు ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ నిబంధనలు జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం వీసా అపాయింట్‌మెంట్ కోసం వేచి చూసే గడువు తగ్గుతుందని పేర్కొంది. అందరికీ సమాన అవకాశాలు లభించేలా ఈ మార్పులు చేసినట్టు తెలిపింది.
వీసా కోసం దరఖాస్తు చేసుకొనేవారు ఒకవేళ తమకు లభించిన అపాయింట్‌మెంట్ రోజున వెళ్లడం వీలుకాకపోతే అదనపు ఫీజు చెల్లించకుండానే ఆ రోజును మరో తేదీకి మార్చుకోవచ్చని వివరించింది. రెండోసారి కూడా వీలుకాకపోతే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకొని, తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాము కోరుకున్న ప్రదేశంలోనే వీసా అపాయింట్‌మెంట్‌కు వెళ్లవచ్చని తెలిపింది. ప్రస్తుతం బీ1/బీ1 విజిటర్ వీసా అపాయింట్‌మెంట్ కోసం వేచి చూసే గడువు హైదరాబాద్‌లో 429 రోజులు, చెన్నైలో 479 రోజులు, ఢిల్లీలో 441 రోజులుగా ఉంది.