టీడీపీ సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం నుంచి అమరావతి వెళ్లడానికి పడే ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ నిర్వేదం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ’ అంటూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది..
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.
గంటా శ్రీనివాసరావు పెట్టిన ట్వీట్‌తో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి బయటపడింది. అందరూ ఇబ్బందులు పడుతున్నా ఇప్పటివరకు ఎవరూ బయటకు చెప్పుకోలేదు. ఇప్పుడు స్వయంగా టీడీపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవడమే తప్ప ఇక్కడ పరిస్థితి మాత్రం అధ్వాన్నంగా ఉందనే విషయం దీని ద్వారా తేటతెల్లమైంది.