Andhrabeats

ఆత్మహత్యలు మగవాళ్లవే ఎక్కువ

ఆడవాళ్ల కంటే మగాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది. కుటుంబ సమస్యలే అందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2015 నుంచి 2022 వరకు కుటుంబ సమస్యల కారణంగా 242,909 (23.06%) మంది మగాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో తెలిపింది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో 1,40,441 (21.05%) పురుషులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించింది. డ్రగ్స్, లిక్కర్‌ అలవాటుతో 60,571 మంది, అప్పుల వలన 39,419 మంది, ప్రేమ వ్యవహారాలతో 28,055 మంది, వివాహ సంబంధిత సమస్యలతో 26,588 మంది పురుషులు తమ ప్రాణాలు తీసుకున్నారు.

వివాహ సంబంధిత సమస్యలతో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మగాళ్లు 26,588 (3.28%) మంది ఆత్మహత్య చేసుకుంటే, మహిళలు 33,480 (9.66%) మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు కూడా పురుషులే ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సంఖ్య 10,532గా ఉంది. ఏ కారణం లేకుండా 87,101 మంది మగాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. 2015 నుంచీ 2022 మధ్య 81,402 (10% )మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్యకు ప్రయత్నించేటప్పుడు పురుషులు ఎంచుకునే పద్ధతుల్లో ఓ కీలకాంశం ఉంది. మగాళ్లు తమ ప్రాణం త్వరగా పోయే పద్ధతులను ఎంచుకుంటున్నారు. రైలు కింద పడటం, లారీ వంటి భారీ వాహనాల కింద పడటం, తుపాకీతో కాల్చుకోవడం, ఉరివేసుకోవడం, ఎలక్ట్రిక్‌ షాక్‌ పెట్టుకోవడం, విషం తాగడం వంటి తీవ్రమైన పద్ధతులను అవలంభిస్తున్నారు. దీంతో ఆస్పత్రికి తీసుకుపోయేలోపే వారు ప్రాణలు కోల్పోతున్నారు. మహిళలు మాత్రం ప్రాణం నెమ్మదిగా పోయే ఆత్మహత్యా పద్ధతులను ఎంచుకుంటున్నారు. వాళ్లు ఎక్కువగా స్లీపింగ్‌ ట్యాబ్లెట్స్‌ మింగడం ద్వారాæ ప్రాణంపై ఆలస్యంగా ప్రభావం చూపే మెథడ్స్‌ ఫాలో అవుతున్నారు. అందుకే వారి ఆత్మహత్యల్లో మరణాల రేటు తక్కువగా ఉంది. ఆత్మహత్యల రేటు ప్రతి లక్ష మంది పురుషులకు 14.2 కాగా.. మహిళల్లో ఇది కేవలం 6.6గా ఉంది.

పురుషుల్లో అయినా, మహిళల్లో అయినా ఆత్మహత్యల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని నేషనల్‌ క్రై మ్‌ రికార్డ్స్‌ బ్యూరో రిపోర్ట్‌ వెల్లడించింది. ప్రతిఒక్కరిలో మానసిక స్థైర్యాన్ని పెంచాలని సూచించింది. వివిధ కార్యక్రమాల ద్వారా భావోద్వేగ నియంత్రణకు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయం అందించాలని తెలిపింది. సామాజిక ఆర్థిక ఒత్తిళ్లు, విద్యాపరమైన వైఫల్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రణాళికలతో పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించింది. స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు వంటి కమ్యూనిటీ ప్రదేశాలను సురక్షిత ప్రదేశాలుగా మార్చాలని చెప్పింది. పిల్లలకు బ్యాడ్‌ టచ్, గుడ్‌ టచ్‌ గురించి ఎలా శిక్షణ ఇస్తామో. పెద్దలకు అన్ని స్థాయిలలో ఆత్మహత్య నివారణ శిక్షణ అవసరమని స్పష్టం చేసింది. ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయాన్ని అందించేందుకు హెల్ప్‌ లైన్ల ఏర్పాటు తప్పనిసరని తెలిపింది.

TOP STORIES