Andhrabeats

ఆధునిక వెర్షన్‌లో ‘కన్నప్ప’

తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో ఆసక్తికరమైన భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా కన్నప్ప సినిమా రూపొందుతోంది. ఈ పౌరాణిక ఫాంటసీ డ్రామా చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో, నటుడు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఆయన కొడుకు విష్ణు మంచు టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో భారతీయ సినిమాలోని పెద్ద నటులు నటిస్తున్నారు. ఏప్రిల్‌ 25న విడుదల కానున్న ఈ సినిమా అత్యున్నత నిర్మాణ విలువలు, స్టార్‌ పవర్, హిందూ పురాణాల్లో ఆసక్తికరమైన కథాంశంతో నిర్మించారు.

కన్నప్ప కథ ఇదీ..
శివ భక్తుడైన కన్నప్ప క«థ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఈ కథ దక్షిణ భారత జానపదాల్లో శతాబ్దాలుగా ప్రసిద్ధి పొందింది. పురాణాల ప్రకారం, కన్నప్ప మొదట్లో వేటగాడు. నాస్తికుడైన తిన్న అనే చెంచు తెగ వ్యక్తి. అడవిలో శివలింగాన్ని చూసిన తర్వాత భక్తుడిగా మారతాడు. ఆ లింగం నుండి రక్తం కారుతుండడం చూసి, తన సొంత కళ్లను అర్పించేంత గొప్ప త్యాగం చేస్తాడు. ఈ భక్తి చూసి శివుడు ప్రత్యక్షమై అతని చూపును తిరిగి ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇది ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంతో ముడిపడి ఉంది. ఇది ఎన్నో సాహిత్య రచనలు, సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది.

1976లో కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప’, 1954లో రాజ్‌కుమార్‌ నటించిన కన్నడ చిత్రం ‘బేడర కన్నప్ప’ వంటి చిత్రాల కంటె భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. పౌరాణిక భక్తిని ఆధునిక సినిమాటిక్‌ టెక్నిక్‌లతో మేళవించి, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకర్షించేలా ఈ సినిమా తీశారు. స్క్రీన్‌ప్లేలో భాగమైన విష్ణు మంచు, ఈ కథ దక్షిణ భారత ప్రేక్షకులకు తెలిసిందే అయినా కొత్త కోణాలు, కొత్త అనుభవాన్ని అందిస్తుందని చెప్పారు.

పాన్‌–ఇండియా స్టార్‌ పవర్‌
కన్నప్ప సినిమాలో అతిపెద్ద ఆకర్షణలలో ఒకటి దాని భారీ తారాగణం. విష్ణు మంచు కన్నప్ప పాత్రలో నటిస్తూ, దాదాపు ఒక దశాబ్దం నుండి ఈ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్నారు. మోహన్‌బాబు, ఆర్‌.శరత్‌కుమార్, ముఖేష్‌ రిషి, బ్రహ్మానందం, రఘు బాబు, ప్రీతి ముఖుందన్‌ (తన రెండవ తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా), మధు వంటి దిగ్గజాలు నటించారు.

ఈ సినిమాను పాన్‌–ఇండియా స్థాయిలో పరిచయం చేసేందుకు ప్రముఖ నటీనటులు ప్రత్యేక కామియో పాత్రల్లో కనిపించనున్నారు. అక్షయ్‌ కుమార్‌ శివుడి పాత్రలో, కాజల్‌ అగర్వాల్, నయనతార వంటి తారలు కీలక సన్నివేశాల్లో భాగమవుతారని సమాచారం.

భారీ బడ్జెట్‌
ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దాదాపు రూ.300 కోట్లతో నిర్మిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్, స్టంట్‌ కొరియోగ్రఫీ కోసం ప్రపంచ స్థాయి నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. సినిమాటోగ్రఫీని షెల్డన్‌ చౌ హ్యాండిల్‌ చేస్తుండగా, సంగీతం స్టీఫెన్‌ దేవసీ, మణిశర్మ ద్వారా రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ 25న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా, భక్తి రసంతో పాటు యాక్షన్, డ్రామా కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమా టీజర్‌లు, పోస్టర్‌లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విష్ణు లుక్, శివ భక్తి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కేవలం ఒక భక్తి కథ కాకుండా, ఆధునిక సినిమా అనుభవంగా కూడా రూపొందుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

 

TOP STORIES