Andhrabeats

రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు

 

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకుంటే వారికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తమ పిల్లలకు ఆస్తిని రాసిస్తూ చేసిన గిఫ్ట్‌, సెటిల్‌మెంట్‌ డీడ్లను నిబంధనల ప్రకారం రద్దు చేసుకునే వెసులుబాటునిచ్చింది. నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్‌ అధికారిగా ఉన్న ఆర్డీవో నుంచి వీటికి సంబంధించి వచ్చిన ఆదేశాలను పాటించి సంబంధిత డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాలిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ శేషగిరిబాబు మంగళవారం ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. తల్లితండ్రుల నుంచి ఆస్తిని రాయించుకున్నాక వారి పిల్లలు పట్టించుకోకపోవడం, వారి రోజువారీ జీవనం, నిర్వహణ బాధ్యత కూడా తీసుకోకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేక చోట్ల జరుగుతున్నాయి. అలాంటి వారికి రక్షణ ఇచ్చేందుకు 2007 సీనియర్‌ సిటిజన్‌ చట్టం వచ్చింది. దీని ప్రకారం తల్లితండ్రులు తమను పిల్లలు పట్టించుకోవడంలేదని సీనియర్‌ సిటిజన్‌ ట్రిబ్యునల్‌ అధికారిగా ఉన్న ఆర్డీవోకు ఫిర్యాదు చేయొచ్చు. విచారణలో తల్లితండ్రులను వారి పిల్లలు చూడడం లేదని ఆర్డీవో నిర్ధారించి ఆర్డర్‌ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలా ఆర్డర్‌ ఇస్తూ వారి ఆస్తిని వెనక్కి ఇవ్వాలని సూచించినా రిజిస్ట్రేషన్ల చట్టంలో ఉన్న అస్పష్టత కారణంగా అది అమలయ్యేది కాదు. ఇప్పుడు దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సర్క్యులర్‌లో స్పష్టత ఇచ్చారు. ట్రిబ్యునల్‌ ఆర్డర్‌ ప్రకారం ఆ ఆస్తిని గతంలో పిల్లలకు రాసిస్తూ తల్లితండ్రులు చేసిన సెటిల్‌మెంట్‌, గిఫ్ట్‌ డీడ్‌లను రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి ఆర్డర్‌ను నేరుగా తల్లితండ్రులు తీసుకువచ్చినా తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లితండ్రులు ఆస్తిని వెనక్కి తీసుకునే నిమిత్తం ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఎలాంటి ఆదేశాలనైనా రిజిస్ట్రేషన్‌ అధికారులు పాటించాలని ఆదేశించారు.

TOP STORIES