Andhrabeats

‘ఎక్స్‌’ను అమ్మేసిన ఎలాన్‌ మస్క్‌

 

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ మరోసారి తన సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)ను తన సొంత కృత్రిమ మేధస్సు (ఏఐ) సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ (ఎక్స్‌ఏఊ)కి విక్రయించినట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం పూర్తిగా షేర్ల రూపంలో జరిగిందని, దీని ద్వారా ‘ఎక్స్‌ఏఐ’ విలువ 80 బిలియన్‌ డాలర్లుగా, ‘ఎక్స్‌’ విలువ 33 బిలియన్‌ డాలర్లుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

‘ఎక్స్‌’ యొక్క ప్రయాణం
ఎలాన్‌ మస్క్‌ 2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ సోషల్‌ మీడియా వేదిక అనేక మార్పులను చవిచూసింది. మస్క్‌ దీన్ని కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ‘ఎక్స్‌’గా మార్చడం, సిబ్బందిని భారీగా తగ్గించడం, కంటెంట్‌ మోడరేషన్‌ విధానాల్లో సడలింపులు తీసుకురావడం వంటి చర్యలతో పూర్తిగా పునర్నిర్మించారు. అయితే ఈ మార్పులు వివాదాలకు దారితీసాయి. దాని సబ్‌స్క్రైబర్ల సంఖ్యతోపాటు ప్రకటనల ఆదాయం తగ్గిపోయింది. దాని వ్యాపార విలువలో 70 శాతం వరకు పతనమైంది.
2024 ఆగస్టు నాటికి దీని విలువ 19 బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు అంచనా.

మస్క్‌ ఈ వేదికను నిజాలను నిర్భయంగా చెప్పడం, స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించే కేంద్రంగా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అంతేకాకుండా పాడ్‌కాస్ట్‌లు, టీవీ షోలు, సినిమాల వంటి పూర్తి నిడివి కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేసే సౌలభ్యాన్ని 2024లో ప్రవేశపెట్టారు. ఈ చర్యల ద్వారా ‘ఎక్స్‌’ను నెట్‌ఫ్లిక్స్‌ వంటి స్ట్రీమింగ్‌ దిగ్గజాలతో పోటీపడే వేదికగా తీర్చిదిద్దాలని భావించారు. అయినా వాణిజ్యపరంగా విజయం సాధించడంలో ‘ఎక్స్‌’ వెనుకబడింది.

‘ఎక్స్‌ఏఐ’తో కొత్త అధ్యాయం
‘ఎక్స్‌ఏఐ’ అనేది 2023లో మస్క్‌ స్థాపించిన కృత్రిమ మేధస్సు సంస్థ. ఈ సంస్థ లక్ష్యం మానవ శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేయడం, అధునాతన ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేయడం. 2024 నవంబర్‌ నాటికి దీని విలువ 50 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఇప్పుడు ఈ ఒప్పందంతో అది 80 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ‘ఎక్స్‌’, ‘ఎక్స్‌ఏఐ’ భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ రెండు సంస్థల డేటా, మోడల్స్, కంప్యూట్‌ పవర్, పంపిణీ, ప్రతిభను కలపడం ద్వారా మేము మరింత తెలివైన, అర్థవంతమైన అనుభవాలను అందిస్తాము,’’ అని మస్క్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ద్వారా క్షీణిస్తున్న ‘ఎక్స్‌’ విలువను కాపాడేందుకు మస్క్‌ చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషకులు చెబుతున్నారు.అదే సమయంలో ‘ఎక్స్‌ఏఐ’ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న సంస్థలో దాన్ని విలీనం చేయడం ద్వారా మస్క్‌ తన వ్యాపార వ్యూహాన్ని బలోపేతం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. గతంలో 2016లో టెస్లా ద్వారా సోలార్‌సిటీని కొనుగోలు చేసినప్పుడు కూడా ఇలాంటి వ్యూహాన్నే మస్క్‌ అనుసరించారు.

మస్క్‌ వ్యాపార సామ్రాజ్యం
ఎలాన్‌ మస్క్‌ వ్యాపార సామ్రాజ్యం విభిన్న రంగాల్లో విస్తరించి ఉంది. టెస్లా (ఎలక్ట్రిక్‌ వాహనాలు), స్పేస్‌ఎక్స్‌ (రాకెట్‌లు, అంతరిక్ష పరిశోధన), న్యూరాలింక్‌ (బ్రెయిన్‌–మెషిన్‌ ఇంటర్‌ఫేస్‌), ది బోరింగ్‌ కంపెనీ (టన్నెలింగ్, రవాణా) వంటి సంస్థలను ఆయన నడిపిస్తున్నారు. ఈ సంస్థలన్నీ పరస్పరం వనరులు, సాంకేతికతను పంచుకుంటూ ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తాయి. ‘ఎక్స్‌’ను ‘ఎక్స్‌ఏఐ’లో విలీనం చేయడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు.

ఎలాంటి ప్రభావం ఉంటుందో?
ఈ ఒప్పందం ‘ఎక్స్‌’ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది అప్పుడే స్పష్టంగా చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ‘ఎక్స్‌ఏఐ’ యొక్క ఏఐ సాంకేతికతను ఉపయోగించి ‘ఎక్స్‌’ కంటెంట్‌ సిఫార్సులు, వినియోగదారు అనుభవం మెరుగుపడవచ్చని కొందరు ఆశిస్తున్నారు. అయితే, గతంలో ‘ఎక్స్‌’లో కంటెంట్‌ మోడరేషన్‌ తగ్గించడం వల్ల వివాదాస్పద పోస్ట్‌లు, తప్పుడు సమాచారం పెరిగిన నేపథ్యంలో ఈ విలీనం కూడా విమర్శలను ఎదుర్కోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మస్క్‌ ‘ఎక్స్‌’ను ఇప్పుడు ‘ఎక్స్‌ఏఐ’ ఆధీనంలోకి మళ్లించడం ద్వారా తన దీర్ఘకాలిక లక్ష్యాలైన సాంకేతిక ఆవిష్కరణ, మానవ పురోగతికి దోహదపడే ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది. అయితే ఈ నిర్ణయం వాణిజ్యపరంగా లాభదాయకంగా మారుతుందా లేక మరింత సవాళ్లను తెచ్చిపెడుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఏది ఏమైనా ఎలాన్‌ మస్క్‌ తన సంస్థలను ఒకదానితో ఒకటి కలపడం ద్వారా తన వ్యాపార విజన్‌ను మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. ‘ఎక్స్‌’ విక్రయం అనేది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ కాదు, భవిష్యత్‌ సాంకేతికతలో మస్క్‌ దృష్టిని ప్రతిబింబించే చర్య. ఈ కొత్త అధ్యాయం మస్క్‌ సామ్రాజ్యాన్ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి.

TOP STORIES