Andhrabeats

ఎయిర్‌పోర్టుల్లో కొత్త బ్యాగేజీ విధానం

Bagage Rules in Indian Airports

 

విమాన ప్రయాణం చేయదలచిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు బ్యూరో ఆఫ్‌ సిలివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) ప్రకటించిన కొత్త హ్యాండ్‌ బ్యాగేజీ విధానం గురించి తెలుసుకోకపోతే చిక్కుల్లో పడక తప్పదు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్‌పాయింట్ల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుండడంతో హ్యాండ్‌ లగేజీ పాలసీకి సంబంధించి నిబంధనలను కఠినతరం చేయాలని బీసీఏఎస్, సీఐఎస్‌ఎఫ్‌ నిర్ణయించాయి. దీంతో వివిధ ఎయిర్‌లైన్లు కూడా ఈ కొత్త విధానాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. కొత్త బీసీఏఎస్‌ హ్యాండ్‌ బ్యాగేజీ పాలసీ ప్రకారం ప్రయాణికులు ఇకపైన విమానంలోకి తమ వెంట ఒక్క బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.

దేశీయ లేదా అంతర్జాతీయ విమానంతో నిమిత్తం లేకుండా ప్రయాణికుడు తన వెంట కేవలం ఒక హ్యాండ్‌ బ్యాగేజీని మాత్రమే విమానంలోకి తీసుకెళ్లగలడు. అదనపు బ్యాగేజీ చెక్‌ఇన్‌ కావలసిందే. ఎకానమీ లేదా ప్రీమియం ఎకానమీ తరగతిలో ప్రయాణించే ప్రయాణికులు తమ వెంట విమానంలోకి 7 కిలోల వరకు బరువున్న ఒక బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుందని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. అయితే ఫస్ట్‌ లేదా బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం సుమారు 10 కిలోల వరకు బరువుండే ఒకే ఒక హ్యాండ్‌ బ్యాగేజీని తీసుకెళ్లవచచ్చని తెలిపింది. బ్యాగేజీ కొలతలను కూడా ఎయిర్‌ ఇండియా స్పష్టం చేసింది.

బ్యాగేజీ ఎత్తు 55 సెంటీమీటర్లు, పొడవు 40 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు మించరాదని తెలిపింది. ఒక్కో ప్రయాణికుడి హ్యాండ్‌ బ్యాగేజీ చుట్టుకొలత 115 సెంటీమీటర్లు మించరాదని కూడా తెలిపింది. ఒకవేళ ప్రయాణికుడి హ్యాండ్‌ బ్యాగేజీ బరువు, విస్తీర్ణం పరిమితిని మించి ఉన్న పక్షంలో అదనపు చార్జీలు భరించక తప్పదని ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. అయితే 2024 మే 2కి ముందు తమ టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు మాత్రం వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులు 8 కిలోల వరకు, ప్రీమియం ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులు 10 కిలోల వరకు, ఫస్ట్‌ లేక బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికులు 12 కిలోల వరకు బరువుండే హ్యాండ్‌ బ్యాగేజీని తీసుకెళ్లవచ్చని ఎయిర్‌ ఇండియా పేర్కొంది.

 

TOP STORIES