Andhrabeats

‘ఏఐ’తో ఆయుర్దాయం పెరుగుతుంది

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు తెస్తోంది. వైద్య రంగంలోనూ వేగంగా చొచ్చుకు వస్తున్న ఏఈ మనిషి ఆయుష్షును పెంచడానికీ దోహద పడుతుందని ప్రఖ్యాత వైద్య నిపుణులు, అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌ ఎండోస్కోపీ ప్రెసిడెంట్‌ డా. ప్రతీక్‌ శర్మ తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగాన్ని ఏఐ శాసిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు ప్రజలకు చేరువ చేసే విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. విశాఖలో జరిగిన డీప్‌టెక్‌ సదస్సులో పాల్గొన్న డా. ప్రతీక్‌ శర్మ వైద్య రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

ఏఐ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. వైద్య రంగంలో మాత్రం అట్టడుగున ఉంది. వైద్య సేవల రంగంలో ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్‌ వంటి టెక్నాలజీలు కీలక ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో ఏఐ వినియోగం పెంచడానికి అన్ని దేశాలూ సంస్కరణలు కూడా తెస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే హెల్త్‌ కేర్‌లో ఏఐ సేవలు 6 శాతమే. 2022కి యూఎస్‌లో ఏఐ అడాప్షన్‌ రేట్‌ 19 శాతమే ఉంది. 2047కి 85 శాతం వరకూ పెరిగే సూచనలున్నాయి. ఇది వైద్య సేవల్ని వేగవంతం చేయడమే కాకుండా మనిషి ఆయుష్షును పెంచేందుకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నారు. ఏఐ వినియోగంతో రోగ నిర్థారణ, సలహాలు, చికిత్సల్లో కచ్చితత్వం వస్తుంది. చాలా సమయం ఆదా అవుతుంది. ఔషధ పరిశోధనల్లోనూ ఏఐ సేవలు పెరుగుతున్నాయి.

హెల్త్‌ కేర్‌లో ఏఐ వినియోగం కోసం అన్ని దేశాలూ పెట్టుబడులు భారీగా పెంచుతున్నాయి. అమెరికా ప్రస్తుతం 28.24 బిలియన్‌ డాలర్లు మాత్రమే వెచ్చిస్తోంది. 2030కి 187.85 బిలియన్‌ డాలర్లను పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయించింది. హెల్త్‌ కేర్‌లో ఏఐ వినియోగంలో భారత్‌ కూడా పురోగమిస్తోంది. భారత్‌లో 2022కి 0.13 బిలియన్‌ డాలర్లు మాత్రమే పెట్టుబడులుండగా.. 2030కి 2.92 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. ఇది శుభపరిణామమే అయినా.. భారత్‌ మరింతగా దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకుంటుంది.

హెల్త్‌కేర్‌లో ఏఐ ఆధారిత అప్లికేషన్లు చాలా వరకూ వినియోగంలో ఉన్నాయి. డయాగ్నసిస్‌ను మరింతగా మెరుగుపరిచేందుకు, రోగి వైద్య రికార్డుల నిర్వహణ, వ్యక్తిగత వైద్య సేవల అభివృద్ధి, వైద్యులపై పనిభారం తగ్గించడం మొదలైన అంశాలకు సంబంధించిన యాప్స్‌ ఉన్నాయి. ఇప్పటికే వీటిని అమెరికా, చైనా, రష్యా, జపాన్‌ వంటి దేశాల్లో ఉపయోగిస్తున్నారు. భారత్‌లో పేరొందిన ఆస్పత్రుల్లో ఇప్పుడిప్పుడే ఇవి ప్రారంభమవుతున్నాయి.

క్యాన్సర్‌ చికిత్సలో ఏఐ అద్భుత ఫలితాలు అందిస్తోంది. ప్రాథమిక దశలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ని గుర్తించడం కష్టతరం. కానీ, అమెరికాలో అతి తక్కువ సమయంలోనే ఏఐ ద్వారా రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించారు. సెర్టిస్‌ ఏఐ యాప్‌ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ఏఐ–డ్రివెన్‌ ఆంకాలజీ డ్రగ్‌ డిస్కవరీతో ఫలితాలు రాబడుతున్నారు. ఊపిరితిత్తులు, మెదడు, మెడ, చర్మ సంబంధమైన క్యాన్సర్ల గుర్తింపు ఫలితాలు కూడా వీలైనంత త్వరగా అందించేలా యాప్‌ల అభివద్ధి జరుగుతోంది.

TOP STORIES