రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు, అలజడులు లేకుండా ప్రశాంతంగా పాలన సాగిపోవాలంటే హోం శాఖ సమర్థవంతంగా పనిచేయాలి. నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే ఆ శాఖను నడపడం సాధ్యమవుతుంది. కానీ ఏపీలో మాత్రం హోం శాఖకు వచ్చిన వినతుల పరిష్కారంలో అసంతృప్తే అధికంగా ఉంది. ఇది 49.76 శాతంగా ఉంది. ఈ గణాంకాలను బట్టే ఆ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, హౌసింగ్, పౌరసరఫరాలు, వైద్య ఆరోగ్యం, విద్యుత్, వ్యవసాయం, విద్యా శాఖలున్నాయి. హోం శాఖ సమస్యలు పరిష్కరించలేకపోవడంలో అగ్రభాగంలో ఉంటే మిగిలినవి తర్వాత స్థానంలో ఉన్నాయి. పాలనలో కీలకంగా ఉండాల్సిన ఆ శాఖలో అనంతృప్తి శాతం అధికంగా ఉండటంతో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఇటీవల జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో దానిపైనే ఎక్కవ సేపు మాట్లాడినట్లు సమాచారం. పౌరులకు అందాల్సిన సేవలు పేలవంగా ఉంటే ఇంకా వారికి ఎలాంటి భద్రత ఇస్తామని మందలించినట్లు సమాచారం. అంతేకాదు తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఆ శాఖ మంత్రి వంగలపూడి అనితతోనూ సీఎం అంటీ ముట్టనట్లుగా ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇటీవల బాలికలపై జరిగిన అత్యాచారాలు, వాటిని నిరోధించడంలో విఫలం చెందడంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అభద్రతాబావం నెలకొంది. ఈ రెండు నెలల్లో మహిళలపై కూడా అత్యాచారాలు అధికంగా జరిగాయి. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే.. దానికి పాల్పడిన వారికి అదే ఆఖరి రోజంటూ సీఎం పదే పదే చెబుతున్నారు. కానీ హోం శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ అంతరాత్మలో ఏముందో
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. హోం శాఖ పనితీరు ఏమాత్రం బాగోలేదని గతంలో ఆయన హెచ్చరించారు. అదే శాఖను తాను తీసుకుని ఉండి ఉంటే ఒక్కొక్కరి తాట తీసేవాడినని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై అనిత కూడా స్పందించారు. ఇరువురు భేటీ జరిగిన తర్వాత ఆ చర్చ అంతటితో ముగిసింది. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు అలా వ్యాఖ్యానించాల్సి వచ్చింది. నిజంగానే హోం శాఖ పనితీరు నక్రమంగా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. పవన్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయనకు హోం శాఖ ఇచ్చేలా పవన్ పావులు కదుపుతున్నారా అనే అనుమానం కూడా రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. అందువల్లే అప్పట్లో ఆయన సంచలన ఆరోపణలు చేశారా అనే అలోచనలు వస్తున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకునే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని అనుకుంటున్నారు.
అనిత దూకుడుకి కళ్లెం తప్పదా..?
హోం మంత్రి పదవి వరించినప్పటి నుంచి అనిత మాజీ సీఎం జగన్ పై ఒంటికాలిపై లేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ అంటూ సంబోధిస్తున్నారు. ఈరకమైన వ్యాఖ్యానం ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే ఈ రకంగా సంభోదించేవారు. తెలుగుదేశం పార్టీ నాయకులు క్రమశిక్షణగానే ఉంటారని ప్రజల అభిప్రాయం. కానీ ఆమె దూత్రం వారికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ హయాంలో హోం మంత్రులుగా పనిచేసిన సుచరిత గానీ తానేటి వనితగానీ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ఏకవచనంతో ఎక్కడా సంభోధించలేదు. కానీ మంత్రి అనిత మాత్రం దూసుకెళ్లిపోతున్నారు. ప్రజలు మాత్రం ఎప్పుడూ హూందాగానే ఉండాలని కోరుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహార శైలి ఉంది. రాబోయే రోజుల్లో హోం శాఖ పనితీరు మార్చుకుంటుందా? లేకపోతే ఆ శాఖలోనే మార్పులు ఉంటాయో వేచి చూడాలి.
_ జి మంగారావు