Andhrabeats

కమ్యూనిస్టు పార్టీల్లో అంతర్గత రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా?

తెలంగాణా సి.పి.ఎం. కార్యదర్సి పదవి ఒక దళితుడికి దక్కింది. మార్క్సిస్ట్‌ పార్టీలో పెద్ద పదవి ఒక మాదిగోడికి దక్కడమా?
ఆదర్శాల ఆకాశం విరిగి పడిపోయిందా, ఏమిటి? ఈ దేశంలో విప్లవం కమ్మవాళ్లూ, రెడ్లూ తేవాలి తప్ప, మధ్యలో ఈ ఎందుకూ కొరగాని మాలమాదిగలెవ్వరు? అసలేం జరుగుతోంది? పోనీ.. ఎందుకూ ఇలా జరిగింది?
లేటుగా అయినా కామ్రేడ్స్‌ కి జ్ఞానోదయం
అయింది అనుకోవాలా? ఇది మార్క్సిస్ట్‌పార్టీ
మన మీద వేసిన క్రూయల్‌ జోకు కాదు కదా!

అసలు ఎవరీ జాన్‌ వెస్లీ? ఎక్కడివాడు?
ఎలా పైకొచ్చాడు? ఎర్రరంగు ఐరన్‌ కర్టెన్‌ వెనక అసలేం జరిగింది? అది మారుమూల మహబూబ్‌నగర్‌ జిల్లా. అందులో వనపర్తి, అక్కడే అమరచింత ఉంది. అంతగా పేరులేని ఆ ప్రాంతానికి చెందిన అతి సాధారణ మాదిగ కుటుంబంలో జాన్‌ వెస్లీ నాలుగోవాడు. అక్కడ
పేద ఎస్సీ కాలనీలో తండ్రి మోజెస్‌కీ, తల్లి బేతమ్మ లకు ఐదుగురు పిల్లలు. మన తాజా మార్క్సిస్ట్‌ నాయకుడు నాలుగో కొడుకు. అమరచింతలో
పది వరకూ, ఇంటర్‌ ఆత్మకూరులో, డిగ్రీ గద్వాలలో చదివాడు. విద్యార్థి విప్లవోద్యమాలలో తిరిగాడు. ఆర్‌.ఎస్‌.యు, పిడిఎస్‌ యు లలో ఎదిగాడు. పి.డి.ఎస్‌.యు, డి.వై.ఎఫ్‌.ఐ, కేవీపిఎస్‌ లలో రాష్ట్ర కార్యదర్శిగా రాణించారు.
దళిత సమస్యలపై ఆయన చేసిన పోరాటం వల్లే నాటి ప్రభుత్వం జస్టీస్‌ పున్నయ్య కమీషన్‌ వేసిందనీ, ఎస్సీఎస్టీ సబ్‌ ప్లాన్‌ తెచ్చిందనీ సి.పి.ఎం వారు చెప్పారు. జాన్‌ వెస్లీ వయసు 56 సంవత్సరాలు. ఆయన భార్య ఒక ప్రైవేటు విద్యా సంస్థలో లైబ్రేరియన్‌ . ఒక కొడుకు.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం వచ్చాక సి.పి.ఎం. బహుజన పాదయాత్ర జరిపింది. మూడు వేల కిలోమీటర్ల దాకా నడిచారు. సూపర్‌ బాస్‌ తమ్మినేని వీరభద్రంతో జాన్‌వెస్లీ కలిసినడిచారు. అప్పట్లో వెస్లీ చేసిన కొన్ని ఉపన్యాసాలు వివాదాస్పదంగా ఉన్నాయని సి.పి.ఎం. సుప్రీం బీవి రాఘవులు విమర్శించారు. అయితే తెలంగాణా సి.పి.ఎం. నాయకత్వం జాన్‌ వెస్లీ వైఖరినే సమర్ధించింది. ఫైనల్‌ గా మొన్న సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో వెస్లీని సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇది రాఘవులు, తమ్మినేనిల ఉమ్మడి నిర్ణయం కావొచ్చు,

వాస్తవానికి, శక్తివంతమైన కార్యదర్శి పదవి
ఈ సారి ఎస్‌.వీరయ్యకి దక్కుతుందని కొందరు వూహించారు. అనూహ్యంగా జాన్‌ వెస్లీ పేరు తెరపైకి వచ్చిందని ‘ఆంధ్రజ్యోతి’ రాసింది. అంటే కామ్రేడ్‌ వీరయ్యని తప్పించడం కోసమే వెస్లీ ఎంపిక జరిగిందా? లోగుట్టు రాఘవులుకి ఎరుక!
లో లోపలి వ్యూహాలు ఏమైనా, దళితుడికి పదవి దక్కినందుకు ఆనందించాల్సిందే!
అటు మందకృష్ణ, ఇటు కృపాకర్‌ మాదిగలు రిజర్వేషన్‌ పోరాటాన్ని మహోద్యమంగా మారుస్తున్న తరుణంలో ఒక మార్క్సిస్టు మాదిగ పార్టీ నాయకుడు కావడం ఆసక్తికరమైన మలుపు.
సంగారెడ్డిలో రాష్ట్ర మహాసభ కార్మికుల విరాళాలతో, శ్రమజీవుల చందాలతో విజయవంతంగా జరిగిందని సీపీఎం దినపత్రిక ‘నవ తెలంగాణ’ రాసింది. గత 60 ఏళ్లుగా చందాలు వసూలు చేయడంలో అందె వేసిన చెయ్యి కమ్యూనిస్టు పార్టీలది. పట్టణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ మహాసభలంటూ విధిగా విరాళాలు పోగు చెయ్యడం ఒక ఆనవాయితీ. నేటి చందాలే రేపటి భవనాలు అని చాలా మందికి తెలియక పోవచ్చు. పాత ఆధిపత్య కులాల భూస్వామ్య మనస్తత్వం వల్ల వాళ్లు ముందు కొంత స్థలం సేకరిస్తారు. ప్రభుత్వాల ముందు మోకరిల్లో, ప్రైవేటు మిత్రుల్ని ప్రాధేయపడో కొద్దిపాటి భూమి సంపాదిస్తారు. ఆనక ‘భవన నిర్మాణ చందా’ అనే పవిత్రమైన నినాదంతో బయల్దేరుతారు. సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, మార్క్‌్స, మల్లయ్య లింగం, లెనిన్‌, మగ్ధుమ్‌… తదితర విప్లవ ఎయిర్‌ కండిషన్డ్‌ భవంతులన్నీ అలా పుట్టుకొచ్చినవే. ఆనక ఎకరాలకు ఎకరాలు సంపాదించి వృద్ధాశ్రమాలు కట్టి సమాజోద్ధారణకు పాల్పడుతున్నాయి వామపక్ష పార్టీలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కావడంలో కమ్యూనిస్ట్‌ నాయకులు
బిజీ అయిపోవడంవల్ల పార్టీకి జనాలు దూరమై భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఎవరి మాటా లెక్క చేయకుండా తలతిక్కగా దూసుకుపోతున్నామని లేటుగా జ్ఞానోదయం అయ్యి ఇప్పుడొక దళితుడికి నాయకత్వ పదవి ప్రసాదించారు.
ఐక్యతా పోరాటం అనీ, వ్యూహమూ ఎత్తుగడలూ అని కమ్యూనిస్టులు అంటుంటారు. జాన్‌ వెస్లీని ఎన్నుకోవడం వ్యూహమా?ఎత్తుగడా? ఒక దెబ్బతో రెండిటినీ సాధించే లౌక్యమా? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక మాదిగకు నాయకత్వం అప్పజెప్పడం ఒక ప్రమాదకరమైన బాంబు పేలుడు. అలనాటి చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్యల నుంచి నేటి కే.నారాయణ, శ్రీనివాసరావుల దాకా, బీవీ రాఘవులు నుంచి తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు వరకూ అందరూ కమ్మవారేనని మనకు తెలుసు. ఇంకా పుచ్చలపల్లి సుందరయ్య, ఎద్దుల ఈశ్వరరెడ్డి, మధు, నీలం రాజశేఖర రెడ్డి, గుజ్జుల యలమందారెడ్డి, రావి నారాయణరెడ్డి నుంచి సురవరం సుధాకరరెడ్డి దాకా అందరూ రెడ్లేనని స్పష్టంగా తెలుసు. ఆ రెండు కులాలే అని కోప్పడి పోవడం కాదు. అది చరిత్ర!

సిపిఐ శ్రేణులు తమనాయకుడు నారాయణ అని, సిపిఐ(యం) కార్యకర్తలు తమ నాయకుడు బీవీ రాఘువులు అని అనుకోవడం సహజం.
అయితే నారాయణ, రాఘవులు తమ నాయకుడు చంద్రబాబునాయుడు అని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. రాజకీయ వ్యాపారి అయిన చంద్రబాబు నాయుడు, భక్తి బిజినెస్‌ మ్యాన్‌ వెంకయ్యనాయుడుతో అతి సన్నిహితంగా ఉంటారు. ఇదొక అందమైన ఎంబ్రాయిడరీ నెట్‌వర్క్‌ లాంటిది .
అతి కొద్దిమంది బీసీలకు, కరివేపాకులా ఒకరిద్దరు మాల మాదిగలకూ కమ్యూనిస్టు నాయకత్వంలో అరుదుగా చోటు దక్కుతుంది. కమ్యూనిస్టు పార్టీల్లో దీనాతి దీనులు దళితులే అనుకుంటే అంతకంటే దరిద్రులు ఇంకొకళ్లు ఉన్నారు.
వాళ్లు మహిళలు! కాంగ్రెస్‌ తెలుగుదేశంపార్టీలు అయినా, సీపీఐ, సీపీఎం అయినా బేసిగ్గా మగ దురహంకార పార్టీలు గనక ఆడవాళ్లు దూరంగా అంటరాని వాళ్లు గానే రిజర్వేషన్‌ కోటాలో మిగిలి ఉంటారు. ఇదో విషాదకరమైన వాస్తవం!

ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పదవిని చాలా ఏళ్ల క్రితం అనంతపురానికి చెందిన యాదవ, బీసీ కే రామకృష్ణ కి అప్పగించారు. అనగా, అగ్రకులాలకి సేవ చేసుకునే అవకాశం రామకృష్టకి కల్పించారు. రామకృష్ణ కంటే కృష్ణా జిల్లా పార్టీ సెక్రటరీ అక్కినేని వనజ ఎక్కువ పవర్‌ ఫుల్‌ అని మనం ఈజీగా ఊహించవచ్చు. ఏది ఏమైనా ఒక మహబూబ్‌ నగర్‌ మాదిగకీ, అనంతపురం బీసీకీ కమ్యూనిస్టు పార్టీల్లో గౌరవం దక్కడం చిన్న విషయం కాదు. అపరాధభావం అంటాం కదా అలాంటి సిండ్రోమ్‌తో కమ్యూనిస్టు పార్టీ సఫర్‌ అవుతున్నట్టు భావించవచ్చా? చాలా పల్టీలు కొట్టాక ఈ గిల్టీ ఫీలింగ్‌ కలగడం సహజమే… అయినా వాళ్ళు కనీసం 50 ఏళ్లు వెనుకబడి ఉన్నారు.

జగ్గుల జాన్‌ వెస్లీ ఏం చేయగలరు?

అదంత ఈజీ కాదు. జాన్‌ వెస్లీ అందరికీ తెలిసిన వ్యక్తి కాదు. ఆయన ఇంటి పేరు జగ్గుల అని ఎవరికి తెలియదు. లేకపోతే ‘ జగ్గుల జాన్‌ కి సీపీఎం పగ్గాలు’ అని జర్నలిస్టులు ఈపాటికే హెడ్డింగ్‌ లు పెట్టేవాళ్లు. కొత్త కార్యదర్శి జాన్‌ వెస్లీ కింద కార్యదర్శి వర్గం అనే పవర్‌ ఫుల్‌ కమిటీ ఉంటుంది. ఆ పైన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉంటుంది.
కనుక ఆధిపత్య కుల ప్రయోజనాలకు ఎలాంటి భంగమూ కలగదు. వాళ్ల అడుగులకు మడుగులొత్తడమే కదా బడుగులకు ఉన్న ఒకే ఒక మహదవకాశం.
కొస విరుపు :
ఈ దేశంలో కులాన్ని మొట్ట మొదట గుర్తించిందీ అసలు కులమే లేదని ప్రచారం చేసిందీ, కొన్ని పెద్ద కులాల ప్రయోజనాల కోసమే దీక్షణగా పనిచేసిందీ, కులమే లేనట్టు నటించిందీ మన విప్లవ కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే.

రచయిత, తాడి ప్రకాష్

TOP STORIES