Andhrabeats

కళ్లు చెదిరిపోయేలా ఏపీలో కోడి పందేలు

Cockfightings in ap
సంక్రాంతి అంటే కోడి పందేలే అన్నట్లు ఏపీలో పరిస్థితి మారిపోయింది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో కోడి పందేలను ఎమ్మెల్యేలే పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోడి పందేల ఫీవర్‌ పాకిపోయింది. అయితే పెద్ద కోడి పందేలకు మాత్రం పశ్చిమ గోదావరి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. పెద్ద పందేలు అంటే లక్షలు.. కొన్నిచోట్ల కోట్లలో కూడా పందేలు జరుగుతున్నాయి. అంటే రెండు, మూడు నిమిషాలు జరిగే పందెంపై కోటి కూడా పెడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అనేక గ్రామాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. మినీ స్టేడియాలను తలపించేలా బరులను సిద్ధం చేశారు. సై అంటున్న పందెం కోళ్లను రాత్రి, పగలు తేడా లేకుండా బరిలో నిలబెట్టేందుకు భారీ తెరలు, ఎల్‌ఈడీ దీపాలు పెట్టారు. అదే సమయంలో పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే అదంతా ఉత్తుత్తినే అని ఎవరికైనా అర్థమైపోతుంది.
చింతమనేని బరి.. కోటికి పైగా వ్యయం
సాధారణ కోడి పందేల బరులకు భిన్నంగా తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో మినీ స్టేడియాన్ని తలపించేలా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాలలో తయారైన ఓ బరి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన సొంత గ్రామమైన దుగ్గిరాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దీన్ని ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు కోటికి పైగా వ్యయంతో పదుల సంఖ్యలో కార్మికులు, నెల రోజులకు పైబడి దీన్ని తయారు చేశారు. చిన్నపిల్లలు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, వీఐపీలకు రెస్ట్‌రూమ్‌లు సిద్ధం చేశారు. పందేలను చూసేందుకు వచ్చే వారి కోసం బరుల వద్ద పెద్దఎత్తున కుర్చీలు వేశారు.
రఘురామకృష్ణంరాజు బరి కూడా..
పశ్చిమ గోదావరి జిల్లా పెద్దఅమిరంలో 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కోడి పందేల బరి సిద్ధమైంది. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినిమా సెట్టింగులను తలపించేలా భారీ బరి దారి పొడవునా ఫ్లెక్సీలు, వేలాది మంది కూర్చునేలా కుర్చీలు, ప్రముఖుల కోసం సోఫా సెట్లు, భారీ తెరలు, ఎల్‌ఈడీ దీపాలతో జబర్దస్‌గా ఏర్పాట్లు చేశారు. సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
20 ఎకరాల విస్తీర్ణంలో బరులు సిద్ధం
బాపట్ల జిల్లా తీరప్రాంతంలో కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, పిట్టలవానిపాలెం మండలం మంతెనవారి పాలెం , కొల్లూరు మండలం అనంతవరంలో ప్రధాన రహదారుల పక్కనే బరులు ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్‌ లైట్లు కూడా పెట్టారు. జూదం ఆడేందుకు ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో బరులు సిద్ధం చేశారు.
ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సమీపంలో కోడి పందేలకు బరులు ఏర్పాటు చేశారు. విస్సన్నపేటలో ఏకంగా కాకతీయ ప్రీమియర్‌ లీగ్‌ పేరుతో పందేల బరులు రూపొందించారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని గ్రామాల్లో భారీగా కోడిపందేల బరులు సిద్ధమయ్యాయి. పందేలు జరిగే ప్రాంతంలో కుర్చీలు, టెంట్లు, ఎయిర్‌ కూలర్లు పెట్టారు. పామర్రు, కూచిపూడి, కోసూరు, పమిడిముక్కల, గడ్డిపాడు, గరికపర్రు, తోట్లవల్లూరు, కొమ్ముమూరు, పెదపారుపూడి, యలమర్రులో భారీ ఎత్తున పందేలకు ఏర్పాట్లు చేశారు.
బరులు పక్కనే కొన్నిచోట్ల మద్యం దుకాణాలు ఏర్పాటుకు ఒప్పందాలు పూర్తయ్యాయి. ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో రెయింబవళ్లు పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా డ్రోన్లు, అత్యాధునిక కెమెరాలతో వీడియో, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, అతిథులకు సరికొత్త రుచులు అందించేలా వంటకాలు తయారీకి వంటగాళ్లను తీసుకొచ్చారు.

TOP STORIES