ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అలాటిది కూటమి ఒరలో మూడు కత్తులు –చంద్రబాబు; అయన కొడుకు లోకేష్; కూటమి కూర్పులో సూత్రధారి అయిన పవన్ కళ్యాణ్. ఇలా అయితే కలహాల కాపురం కాక మరేమవుద్ది.
కూటమి విజయ పరంపర కు తానే కారణం అని పవన్ భావన. అది నిజం కూడా కావొచ్చేమో!
బాబు మరోసారి అధికార పీఠం ఎక్కడానికి బీజేపీ తో సంధి కుదరడం కీలకంగా మారింది. అలాటి కూటమి రధచక్రానికి పవన్ ఇరుసు లాటి వాడు. “మోడీ గారికి, అమిత్ షా గారికి బాబు తో పొత్తుకు ఇష్టం లేదు. నేనే వాళ్ళను ఒప్పించాను” అని ఎన్నికలయిన కొద్దీ రోజులకే చెప్పి ఈ అభిప్రాయనికి పవన్ బలం కల్పించారు.
పీఠాపురం లో పవన్ వోడి కూటమి భారీ విజయం సాధించి ఉంటే బాబు-లోకేష్ లకు ఏ గొడవ వుండకపోను.
పీఠాపురం లో గెలిచిన కొద్దీ రోజుల్లోనే కూటమి పెద్దలపైన కళ్యాణ్ మొదటి తూటా పేల్చారు. పీఠాపురం లో ఎస్పీ లాటి పొలిసు ఉన్నతాధికారులే మహిళలకు భద్రత కల్పించడం లో భరోసా ఇవ్వలేకపోయారు. ఇక తానెందుకు జగన్ తో పోరాడి కూటమిని ఎందుకు గెలిపించినట్టు అని ఆవేదన పడి పరిస్థితి ఇలాగె ఉంటే హోమ్ శాఖను తానే తీసుకోవాల్సివస్తుంది అని హెచ్చరించారు. చంద్రబాబు ఇలాకాలో అధికారులు పనిచేయడం లేదు అంటే వాళ్లకు పోస్టింగులు ఇచ్చిన లోకేష్ మీద బాణం ఎక్కుపెట్టినట్టే!
పవన్ ఇలా ప్రభుత్వం పైన అస్త్రాలు సంధించడం టీడీపీ వర్గాలకు మింగుడు పడట్లేదు. రానున్న ఎన్నికల నాటికీ బాబు ప్రభుత్వ వైఫల్యాలను అధికార సోపానాలుగా పవన్ మలుచుకుంటున్నారని బాబూ పరివారానికి మింగుడు పడట్లేదు. అందుకే లోకేష్ ను పవన్ కు పోటీగా ఉప ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్ చేసే ప్రయత్నాలు.
ఈ పూర్వరంగం లో బాబు గారు ఇచ్చిన ర్యాంకింగ్ ల్లో పవన్ వెనకపడ్డారు. లోకేష్ ముందు ఉన్నారు. దీనితో జన జనసేనానికి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. ఆరోగ్యం బాగాలేదని కాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టి పవన్ తన నిరసన తెలిపారు. పవన్ వెంటనే కేరళ పర్యటన చేపట్టి తాను కాబినెట్ సమావేశానికి రాకపోవడానికి ఆరోగ్యసమస్య కానే కాదని చెప్పకనే చెప్పేశారు.
కూటమి ప్రభుత్వం ఇంకా మొదటి వార్షికోత్సవం కూడా జరుపుకోలేదు. ఇంకా నాలుగేళ్లు పైనే కలిసుండాలి. ఇలా అయితే కూటమి లో సుడిగుండాలు తప్పవేమో!
– నాగరాజ గాలి, సీనియర్ జర్నలిస్టు