అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకొని చుస్తే ఇట్టే తెలిసిపోతుంది. అలాగే కూటమి ప్రభుత్వ పోకడ ఎలా ఉండో ఆరు నెలల పాలన చూస్తే తెలిసిపోతూ ఉంది.
1. కూటమి పాలనా లేక కుటుంబ పాలనా?
ఇది సకుటుంబ కథాచిత్రం. నడుస్తున్నది కూటమి ప్రభుత్వం కాదు రెండు కుటుంబాల ప్రభుత్వం అని అందరి నోళ్ళల్లో నానుతున్న మాట. గత జగన్ పాలనలో ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు కొడుకు లోకేష్ కు న్యాయం చేశారు. ఎప్పుడూ చట్ట సభల మొఖం చూడకపోయినా నాగబాబు నేరుగా మంత్రి అయిపోతున్నాడు. ఆలా కళ్యాణ్ బాబు అన్నకు న్యాయం చేశాడు. తల్లికి, చెల్లికీ న్యాయం చేయలేకపోయాడని ఇద్దరు బాబులు (చంద్రబాబు-కళ్యాణ్ బాబు) జగన్ ను ఉతికి ఆరేసి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఆలస్యం చేయకుండా రక్త సంబంధానికి తగిన రీతిలో న్యాయం చేసుకున్నారు. Blood is Thicker than wWater అని ఊరికే అనలేదు.
గత నాలుగు దశాబ్దాలుగా ఐదారు సార్లు ఎన్నికల్లో గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటివాళ్లకు కూడా దక్కని అమాత్య పదవులు సునాయాసంగా ఆ ఇద్దరినీ వరించాయి.
2. రాజకీయాలలో ఎన్టీఆర్ కు, చంద్రబాబు కు మధ్య వున్న తేడా గురించి చెప్పాల్సివచ్చినప్పుడు తులసిరెడ్డి (ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు) రాజ్యసభ సభ్యుడైన (జరిగిన) కథను తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు చెబుతూ ఉంటారు. గండిపేటలో ఆ రోజుల్లో తులసిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వ్యక్తిగత సహాయకుడిగా ఉండేవారు. ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై ఎన్టీఆర్ కు, చంద్రబాబు కి మధ్య చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని రెడ్డి కులం నుంచి ఒకరిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని బాబు ప్రతిపాదించారు. పనిలో పనిగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక భాగ్యవంతుని పేరును బాబు తెరమీదకు తెచ్చారు. ఇంతలో తులసి రెడ్డి ఒక ట్రే లో గ్లాసుడు మంచినీళ్లు, టాబ్లెట్లు పెట్టుకుని ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. “బాబు గారూ, ఏమంటిరి? రెడ్డి సామాజికవర్గం అభ్యర్థిని రాజ్యసభకు పంపాలని అంటిరా! అయితే తులసి రెడ్డి గారే మన అభ్యర్థి” అని చెప్పి 500 నోటు తులసిరెడ్డి చేతిలో పెట్టి నామినేషన్ దాఖలు చేయమన్నారట.
అలాంటి సామాన్యులు బాబు హయాంలో పార్లమెంటుకు వెళ్లే పరిస్థితి వుందా? రాజ్యసభకు అయితే అసలే లేదు అని మొన్న భర్తీ అయిన స్థానాలను బట్టి తెలుస్తోంది. బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వీళ్ళే కదా!
బీజేపీ తరపున ఎంపికైన బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య ను చుస్తే వికారం కలుగుతుంది. అయన మారని పార్టీ లేదు. బీజేపీ కృష్ణయ్యను నిలబెడితే టీడీపీ ఓట్లతో బాబు గెలిపించాలి.
2. బాబు-జగన్: పాలనలో తేడా ఏంటి?
రంగు, రుచి, వాసనలో ఏమయినా తేడా ఉంటే కూటమి వాళ్ళు చెబితే వినాలని వుంది. జగన్ శిబిరం నుంచి టీడీపీలోకి రాగానే టికెట్ వస్తుంది. ఏకంగా వాళ్ళు మంత్రులయిపోతారు కూడా. బీదా మస్తాన్ రావు సంగతే చూద్దాం. వైసీపీ ఆయన్ను రాజ్యసభకు పంపింది. బాగా డబ్బున్న ఆసామి అనుకోండి. టీడీపీ అధికారంలోకి రాగానే మస్తాన్ రావు రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. వెంటనే ఆయనకు టీడీపీ రాజ్యసభ టికెట్ వచ్చేసింది. పైసామే పరమాత్మా హాయ్. అదే బాబు పాలన.
__ నాగరాజ గాలి