గుండెపోటు గురైన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని (54)ని (శ్రీ వెంకటేశ్వరరావు) ఆరోగ్య పరిస్థితి పార్టీ వర్గాలు, అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను సోమవారం హైదరాబాద్‌లోని ఏఏజీ ఆస్పత్రి నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మార్చి 25వ తేదీన ఆయనకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ) ఆస్పత్రిలో చేర్చారు.
మూసుకుపోయిన మూడు రక్తనాళాలు
మార్చి 25న ఉదయం కొడాలి నానికి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమికంగా గ్యాస్ట్రిక్ సమస్యగా భావించినప్పటికీ, వైద్య పరీక్షల్లో గుండెలో లోపాలు కనిపించాయి. వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. గుండెలోని నాలుగు ప్రధాన రక్తనాళాల్లో మూడు మూసుకుపోయినట్లు తెలిసింది. దీంతో ఆయనకు అత్యవసర చికిత్స అవసరమైంది. దీనికితోడు అదనంగా కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్ల సమాచారం.
సర్జరీ కోసం ఏర్పాట్లు
ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో చికిత్స పొందిన తర్వాత, ఆయన పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్య సేవల కోసం మార్చి 30 ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స అవసరమని సూచించినట్లు తెలుస్తోంది, అయితే దీనిపై అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.
ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్
కొడాలి నాని అస్వస్థత వార్త తెలియగానే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఆయన్ను పరామర్శించారు. ‘నాని త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలని’ కుటుంబసభ్యులను ఆయన ఆకాంక్షించారు. ఇతర వైసీపీ నేతలు కూడా ఆస్పత్రికి చేరుకుని, కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.
అభిమానుల ఆందోళన
సోషల్ మీడియాలో కొడాలి నాని ఆరోగ్యంపై గురించి వివిధ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. గతంలో కిడ్నీ సమస్యలతో బాధపడిన నాని, 2022లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అధికారిక హెల్త్ బులెటిన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.