ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. క్యాన్సర్‌కు టీకా అభివృద్ధి చేసినట్టు రష్యా బుధవారం చేసిన ప్రకటన క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా మారే అవకాశం ఉంది. తమ దేశంలోని పలు పరిశోధన సంస్థలు కలిసి క్యాన్సర్‌ను ఎదుర్కొనే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను తయారుచేసినట్టు రష్యా న్యూస్ ఏజెన్సీ టీఏఎస్‌ఎస్ వెల్లడించింది.
వచ్చే ఏడాది నుంచి క్యాన్సర్ బాధితులకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పని చేసే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రే కాప్రిన్ తెలిపారు. క్యాన్సర్ కణాలను గుర్తించి, అంతం చేసేలా శరీర రోగ నిరోధక వ్యవస్థను ఈ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ సిద్ధం చేస్తుంది. క్యాన్సర్ కణతుల అభివృద్ధిని, రోగ సంబంధ కణాల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తున్నట్టు ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని గమలేయ నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ వెల్లడించారు.
ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం తాము క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీకి చాలా చేరువలో ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ పేరు ఏంటనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. రష్యాలో క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతుండటంతో కొన్నేండ్లుగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. 2022లో రష్యాలో 6,35,000 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.
క్యాన్సర్ వ్యాక్సిన్ల తయారీకి ముమ్మర పరిశోధనలు
క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. థెరఫ్యూటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలపై ఉండే నిర్దిష్ట ప్రొటీన్లు, యాంటీజెన్లను లక్ష్యంగా చేసుకొని, అంతం చేసేలా శరీర రోగ నిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తాయి. ఇందుకోసం కొన్ని వ్యాక్సిన్లలో నిర్వీర్యం చేసిన లేదా మాడిఫై చేసిన వైరస్‌లను ఉపయోగిస్తారు. ఇవేకాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వంటి క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా యి. ఇవి సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటి ముప్పును తగ్గిస్తాయి. శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్ కణతులు వేగంగా ఎదగకుండా, తిరగబడకుండా అడ్డుకోవడంలో, ప్రారంభ దశలో క్యాన్సర్‌ను తొలగించడంలో వ్యాక్సిన్లు కీలకంగా పని చేస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సొంతంగా క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ దిశగా అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గ్లియోబ్లాస్టోమా అనే ఒక రకమైన బ్రెయిన్ క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. మే నెలలో పరీక్షలు జరపగా ఆశాజనకమైన ఫలితాలు వచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. యూకేలో సైతం మెలనోమా అనే చర్మ క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను తయారుచేసి పరీక్షించగా వ్యాధి బాధితులు కోలుకునే అవకాశాలు గణనీయంగా పెరిగినట్టు ప్రకటించారు.