Andhrabeats

గంటలో 5 చైన్ స్నాచింగ్ లు.. హడలెత్తించిన ఆ ఇద్దరు

గంట వ్యవధిలో ఒకే ప్రాంతంలో ఐదుగురు మహిళల మెడలో బంగారు గొలుసులు తెంపుకుని పరారయ్యారు ఇద్దరు దొంగలు.
తూర్పుగోదావరి జిల్లా కుమారదేవానికి చెందిన నక్కా ధనలక్ష్మి కొవ్వూరు పట్టణంలోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లేందుకు జూనియర్‌ కళాశాల ఎదురు వీధిలో నడుస్తున్నారు. సరిగ్గా అప్పుడే శిరస్త్రాణం ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చారు. వెనుక నుంచి ఆమె మెడలోని మూడున్నర కాసుల బంగారు గొలుసు లాక్కుని ముందుకెళ్లిపోగా, ధనలక్ష్మి కింద పడిపోయారు. ఈ ఘటన జరిగిన 5 నిముషాల తేడాలో కాస్త ముందున 13వ వార్డుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త బర్ల లలిత అపర్ణాదేవి మెడలోని 5 కాసుల గొలుసు, ఒకటిన్నర కాసుల నల్లపూసల తాడును లాక్కున్నారు. ఆ పెనుగులాటలో 2 కాసుల విలువైన భాగం ఆమె చేతిలో ఉండిపోయింది. సుమారు నాలుగున్నర కాసుల బంగారం దుండగులు పట్టుకుపోయారు. 11.30 గంటల సమయంలో కొంతమూరుకు చెందిన చింతలూరి అన్నపూర్ణ కోడలితో కలసి రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం వద్ద నడుచుకుంటూ వెళుతుండగా.. అన్నపూర్ణ మెడలోని 72 గ్రాముల బంగారు చంద్రహారం లాక్కుని పరారయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు సుబ్బారావునగర్‌కి చెందిన మహంతి కనకమహాలక్ష్మి క్వారీ మార్కెట్‌ కూడలి సమీపంలో తన హోటల్‌ పనులు ముగించుకుని వెళుతుండగా ఆమె మెడలోని 32 గ్రాముల బంగారు సూత్రాల తాడును లాక్కుని పరారయ్యారు. ఈ క్రమంలోనే కొంతమూరులో నడిచి వెళ్తున్న సాగిరాజు చంద్రావతి అనే మహిళ మెడ నుంచీ ఎనిమిది కాసుల బంగారు గొలుసులు, నల్లపూస తాడును పై తరహాలోనే లాక్కెళ్లారు. మొత్తంగా గంటలో ఐదు ప్రాంతాల్లో ఐదుగురు మహిళల మెడల్లోని 120 గ్రాముల బంగారం తస్కరణకు గురైంది. అన్ని చోట్లా నిందితులు ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తుండగా.. ఎస్పీ నరసింహకిషోర్‌ ఆదేశాలతో కడియం సహా ‘తూర్పు’లోని అనేక రహదారి ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. ఆగంతుకులు కోరుకొండ, గోకవరం మీదుగా రంపచోడవరం వైపు పరారైనట్లు సమాచారం. కొవ్వూరు సీఐ పి.విశ్వం, రాజానగరం సీఐ వీరయ్యగౌడ్, రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులు స్టేషన్‌ సీఐ అప్పారావు వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TOP STORIES