ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి గెలుపొందారు. 9,165 ఓట్లు సాధించి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం. ప్రత్యర్థి గంధం నారాయణరావుకి సుమారు 5,259 ఓట్లు పడ్డాయి.
సోమవారం కాకినాడ జేఎన్టీయూ డా.బీఆర్.అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఓట్ల లెక్కింపు జరిగింది. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో 14 టేబుల్స్ పై 76 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు.
ఆరు జిల్లాల్లో 116 కేంద్రాల్లో 92.62 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 16,737 మంది ఓటర్లుగాను, 15,502 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన చెల్లిన ఓట్లలో గోపిమూర్తి కి 9,165 ఓట్లు రావడంతో ఆయన విజయం ఖాయమైంది. ప్రధాన ప్రత్యర్థి గంధం నారాయణరావుకి 5,259 ఓట్లు వచ్చాయి. ఈయనపై గోపిమూర్తి 3,906 ఓట్లు మెజారిటీని సాధించారు. 14 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ జరగ్గా గోపిమూర్తికి ఆద్యంతం ఆధిక్యం కొనసాగడం విశేషం. ఎన్నికల పరిశీలకులు కె. హర్షవర్ధన్, ఆర్వో షణ్మోహన్, కాకినాడ ఆర్డీవో ఎస్ మల్లి బాబు, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ రామలక్ష్మి, కాకినాడ అర్బన్ తహశీల్దార్ జితేంద్ర తదితరులు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
తొలిత డా.బీఆర్.అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలోని భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమ్ ను ఎమ్మెల్సీ అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో ఎన్నికల సిబ్బంది తెరిచారు.