ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మూడో సారి గెలిచినా భాగ స్వామ్య పక్షాల మద్దతు మోదీకి అవసరమైంది. వరుసగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ లో గెలుపు తరువాత మోదీ లెక్కలు మారుతున్నాయి. ఇండియా కూటమి పైన గురి పెట్టారు. కాంగ్రెస్ కూటమి మిత్రులను మోసం చేస్తోందని కొత్త పల్లవి అందుకున్నారు. ఇదే సమయంలో తమ పైనే మోదీ ప్రభుత్వం మనుగడ ఆధార పడి ఉందని భావిస్తున్న మిత్రపక్షాలను ప్రధాని ఫిక్స్ చేసారు. జమిలి వేళ వ్యూహాత్మక ఎత్తుగడలతో అడుగులు వేస్తున్నారు.
వరుస విజయాలతో
ప్రధాని మోదీకి వరుస విజయాలు దక్కుతున్నాయి. ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత బీజేపీకి అధికారం దక్కింది. దీని వెనుక మోదీ – షా ద్వయం వ్యూహాలు పక్కాగా పని చేసాయి. ఆరెస్సెస్ శ్రేణులు శక్తి మేర పని చేసాయి. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆరెస్సెస్, ఢిల్లీలోనూ అదే కొనసాగించింది. కాగా, మూడో సారి మోదీ ప్రభుత్వం మిత్రపక్షాల మద్దతుగా కొనసాగుతోంది. కూటమిలో నితీశ్, చంద్రబాబు కీలకంగా మారారు. గతంలో చంద్రాబు, నితీశ్ తో బీజేపీ అధినాయకత్వానికి రాజకీయ అనుభవాలు ఉన్నాయి. దీంతో.. వారితో మైత్రి కొనసాగిస్తూనే.. తమ బలం చాటుతూ తమ సత్తా ఏంటో నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
పెరిగిన మోదీ ఇమేజ్
మరి కొద్ది నెలల్లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజా కేంద్ర బడ్జెట్ లో బీహార్ మినహా మరే రాష్ట్ర పేరు ప్రస్తావన చేయలేదు. బీహార్ బడ్జెట్ అనే విమర్శలు వచ్చినా.. మోదీ ప్రభుత్వం లెక్క చేయలేదు. బీహార్ లో ఎన్నికల నాటికి పొత్తులు.. సమీకరణాల్లో ఎలాంటి మార్పు లు వచ్చినా…ఎదుర్కునేలా బడ్జెట్ తోనే పక్కా వ్యూహాత్మక అడుగులు ప్రారంభించారు. ఇటు ఏపీ లోనూ ఢిల్లీ కేంద్రంగా ఆసక్తి కర రాజకీయం కొనసాగుతోంది. ఏపీలో చంద్రబాబు సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నా.. కీలక నిర్ణయాలు మాత్రం ఢిల్లీతో చర్చించిన తరువాతనే తీసుకునే పరిస్థితి ఏర్పడింది. గతం కంటే భిన్నంగా బీజేపీ ఏపీతో డీల్ చేస్తోంది.
పక్కా వ్యూహం
ఏపీ ఆర్దిక – రాజకీయ పరిస్థితుల్లో పూర్తి పట్టు సాధించేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గత అనుభవాలతోనే బీజేపీ ఈ తరహా ప్లాన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది బిహార్, వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్, తర్వాత ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. జమిలి దిశగా కసరత్తు చేస్తున్న మోదీ టీంకు ఈ రాష్ట్రాల్లో గెలుపు అవసరం. ఇందు కోసం మిత్ర పక్షాల నుంచి ఎటాంటి ఇబ్బంది లేకుండా ఫిక్స్ చేస్తూ.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. మోదీ ఇప్పుడు బీహార్ తో పాటుగా ఇండియా కూటమి పైన గురి పెట్టారు. పార్ల మెంట్ సమావేశాల తరువాత ఆపరేషన్ బీహార్ ప్రారంభం కానుంది. దీంతో, రానున్న రోజుల్లో బీహార్ తో పాటుగా ఏపీలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.