Andhrabeats

జనవరి 1 నుంచి ఏపీకి కొత్త సీఎస్, డీజీపీ

రాష్ట్రానికి త్వరలో కొత్త సీఎస్‌ (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి), డీజీపీ నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా పనిచేస్తున్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావులు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. నీరబ్‌కుమార్‌ మూడు నెలల క్రితమే రిటైర్‌ అయినా చంద్రబాబు కేంద్ర అనుమతితో మరో మూడు నెలలు పొడిగించారు. ఈ నెలాఖరుతో ఆ గడువు ముగియనుంది. మరోసారి ఆయన సర్వీసు పొడిగించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. దీంతో ఈ నెలాఖరుకల్లా కొత్త సీఎస్‌ను ఖరారు చేయాల్సివుంది.
సీనియారిటీ జాబితా ప్రకారం శ్రీలక్ష్మి (1988 బ్యాచ్‌), అనంతరాము (1990 బ్యాచ్‌), సాయిప్రసాద్‌ (1991 బ్యాచ్‌), అజయ్‌జైన్‌ (1991), సుమితా దావ్రా (1992 బ్యాచ్‌), ఆర్పీ సిసోడియా (1992 బ్యాచ్‌), విజయానంద్‌ (1992 బ్యాచ్‌), బుడితి రాజశేఖర్‌ (1992 బ్యాచ్‌) పేర్లను పరిశీలించాల్సివుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వ ప్రాధామ్యాల ప్రకారం విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా పేర్లను పరిగణలోకి తీసుకుని పరిశీలించారు.  వారి పదవీ విరమణ కాలం ఆధారంగా  అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అందులోభాగంగా తొలుత విజయానంద్‌కి ఆ తర్వాత సాయిప్రసాద్‌కి సీఎస్‌గా అవకాశం కల్పించనున్నారు. ఆయన 2025 ఆగస్టు నెలాఖరులో రిటైర్‌ అవ్వనున్నారు. అప్పటివరకు ఆయన్ను సీఎస్‌గా కొనసాగించి ఆ తర్వాత సాయిప్రసాద్‌ను సీఎస్‌గా చేస్తారని అధికారవర్గాలు తెలిపాయి.
ఇక కొత్త డీజీపీగా ద్వారకాతిరుమలరావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండగా మరో మూడు నెలలు ఆయన సర్వీసు పొడిగించే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ కొత్త డీజీపీని నియమించాలని నిర్ణయిస్తే హరీష్‌కుమార్‌ గుప్తాకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఒకటి రెండురోజుల్లో ఈ నియామకాలపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

TOP STORIES