భారతదేశంలో జనాభా తగ్గుదల పట్ల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మహేష్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణించడం ఇలాగే కొనసాగితే సమాజం దానంతట అదే నశించిపోతుందని చెప్పారు. నాగ్‌పుర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ కుటుంబాలు సమాజంలో భాగమని తెలిపారు.
జనాభా తగ్గుదల ఆందోళనకరమైన విషయమని అన్నారు. జనాభా శాస్త్రం ప్రకారం జనాభా పెరుగుదల రేటు 2.1 కన్నా తగ్గితే సమాజం దానంతట అదే నశిస్తుందని, ఎవరూ అంతం చేయాల్సిన అవసరం లేదనానరు. అలాగే భాషలు కూడా కనుమరుగవుతాయని చెప్పారు. భారత జనాభా విధానం కూడా ఈ రేటు 2.1 కన్నా తక్కువ ఉండకూడదని చెబుతోందని తెలిపారు. భారతదేశ జనాభా పెరుగుదల మూడు శాతంగా ఉండాలని, అలా లేకపోతే మన సమాజం మనుగడ కష్టమవుతుందని తెలిపారు.
1960–2000 మధ్య రెట్టింపైన ప్రపంచ జనాభా ఆ తర్వాత నుంచి తగ్గుతోంది. ప్రతి మహిళ 2.1 మంది పిల్లల్ని కంటేనే పాతతరాన్ని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. దీన్నే జనాభా భర్తీ రేటు అంటారు. 2.1కి దరిదాపుల్లో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యునీసియా ఉన్నాయి. 2.1కన్నా తక్కువ రేటు ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికోలు ఉండగా. చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో అంతకన్నా తక్కువ కనిపిస్తోంది.