Andhrabeats

టీడీపీ ఎమ్మెల్సీ ఆశావహుల్లో ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు సోమవారం (10వ తేదీ) ఆఖరు తేదీ కావడంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగుస్తోంది. జంగా కృష్ణమూర్తి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన జనసేనకు టీడీపీ కేటాయించింది. ఈ క్రమంలో ఆ పార్టీ తరపున కొణిదెల నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మిగతా నాలుగు స్థానాల కోసం టీడీపీ ఆశావహుల్లో తీవ్ర పోటీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి సీట్లు త్యాగం చేసిన నేతలతో పాటు, సీనియర్ నేతలు, పోటీ చేసి ఓడిపోయిన వారు ఈ పోటీలో ముందున్నారు. నామినేషన్ దాఖలుకు మరో 48 గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌ను ఆశావహులు కలిసి తమకు అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు.

ప్రస్తుతం ఆశావహుల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, కొమ్మాలపాటి రవిచంద్ర, మాజీ మంత్రి కేఎస్ జవహర్, బుద్దా వెంకన్న, వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, పల్లం సరోజిని, కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రెడ్డి సుబ్రమణ్యం, మల్లెల లింగారెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, పరసా రత్నం, ఏఎస్ రామకృష్ణ, మంతెన సత్యనారాయణరాజు, రుద్రరాజు పద్మరాజు, మహ్మద్ నజీర్, షేక్ నాగుల్ మీరా ఉన్నారు.

నెలాఖరుతో పదవీ కాలం ముగియనున్న అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావులు కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న నాలుగు సీట్లలో రెండు బీసీలకు, ఒకటి ఓసీ, మరొకటి ఎస్సీ లేదా మైనార్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఓసీల్లో మాజీ మంత్రి దేవినేని ఉమా, వంగవీటి రాధా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనసేన నుంచి నాగబాబుకి సీటు ఇచ్చినందున సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆ ప్రభావం వంగవీటి రాధాపై పడుతుందని, అందువల్ల ఈ సారి ఆయనకు అవకాశాలు తక్కువేనని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక బీసీల్లో మోపిదేవి వెంకట రమణ, బీదా రవిచంద్ర, బుద్దా వెంకన్నల్లో ఒకరికి అవకాశం లభించవచ్చని అంటున్నారు.

ఇక ఎస్సీ మహిళా కోటా పల్లం సరోజిని, మైనార్టీ కోటాలో అయితే మహ్మద్ నజీర్‌కు అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆశావహుల్లో విజేతలు ఎవరు అనేది ఈ రోజు (ఆదివారం) సాయంత్రానికి లేదా రాత్రికి తేలే అవకాశం ఉంది.

చంద్రబాబు ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉండటంతో అశావహులు అమరావతిలోనే తిష్ట వేశారు. కొందరైతే తమ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే భావిస్తూ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నారు.

TOP STORIES