Andhrabeats

డిజిటల్‌ అరెస్టు.. 1.78 కోట్లు పోగొట్టుకున్న యువతి

సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పోలీసులు, సైబర్‌ నిపుణులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా కొందరు మాత్రం నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ముంబైలో ఒక యువతి ఏకంగా రూ.1.78 కోట్లను చేజార్చుకుంది.

ముంబైలోని బోరీవాలి ఈస్ట్‌కు చెందిన ఓ యువతికి నవంబర్‌ 19న ఒక ఫోన్‌ వచ్చింది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల నుంచి ఫోన్‌ చేస్తున్నామని దుండగులు ఆమె పేరు, అన్ని వివరాలు చెప్పారు. ప్రస్తుతం జైలులో ఉన్న జెట్‌ ఎయిర్‌ వేస్‌ ఫౌండర్‌ నరేశ్‌ గోయెల్‌ కేసులో మీ పేరు కూడా ఉందని చెప్పారు. మనీలాండరింగ్‌ కేసు నమోదైందంటూ ఆ యువతిని బెదిరించారు. ఆపై వాట్సాప్‌ వీడియో కాల్‌ చేసి డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నామని, విచారణకు సహకరించాలని కోరారు. ఇంట్లో ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఏదైనా హోటల్‌లో రూమ్‌ తీసుకోవాలని సూచించడంతో అప్పటికే బెదిరిపోయిన యువతి వారు చెప్పినట్లే చేసింది.

హోటల్‌ రూమ్‌లో బాడీ చెకప్‌ చేయాలని యువతి దుస్తులు విప్పించారు. ఆపై సెక్యూరిటీ వెరిఫికేషన్‌ కోసమని చెప్పి రూ.1.78 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. వివరాలన్నీ మరోసారి పరిశీలించిన తర్వాత మళ్లీ ఫోన్‌ చేస్తామని చెప్పి కాల్‌ కట్‌ చేశారు. కానీ అప్పటి నుంచి వారి ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో ఆమె మోసపోయానని గ్రహించింది. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. డిజిటల్‌ అరెస్ట్‌ అనేదే లేదని, ఇలాంటి ఫోన్‌ కాల్స్‌కు భయపడకుండా సైబర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

TOP STORIES