Andhrabeats

డెడ్ బాడీ పార్సిల్ కేసులో ట్విస్టులే ట్విస్టులు

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డెడ్ బాడీ పార్సిల్ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆస్తి కోసమే ఈ వ్యవహారం అంతా చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీధర్ వర్మ తన వదిన సాగి తులసి ఆస్తిని కాజేయాలనే యోచనతో ఈ పథకం రచించాడు. మొదట ఒక సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. ఆదేక్రమంలో పార్సిల్లో శవాన్ని పంపి తులసిని భయపెట్టాలని భావించినట్లు తెలుస్తోంది. తులసికి శవాలంటే భయమని కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులకు తప్ప బయటివారికి తెలిసే అవకాశం ఉండదని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా ఎక్కడి నుంచైనా శవాన్ని తేవాలని ప్రయత్నించారని, అది కుదరకపోవడంతో అమాయకుడైన బర్రె పర్లయ్యను చంపేశారని తెలుస్తోంది. అతడిని కారులో ఎక్కించుకుని ఉండి మండలం పెదపుల్లేరు దారిలో వెళ్లారని.. కారులోనే హత్య చేశారని సమాచారం. ఈ నెల 17న హత్య చేసి ఉంటే 19వ తేదీ వరకు మృత దేహాన్ని ఎక్కడ దాచారు? శవాన్ని పార్సిల్ చేసి తులసిని బెదిరిస్తే వచ్చే ఆస్తిని ఎంతమంది కాజేయాలనుకున్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. శవాన్ని పంపిన ఆనంతరం ఈ నెల 20 నుంచి అదృశ్యమైన శ్రీధర్ వర్మను మచిలీపట్నం సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి.

ఎవరీ పర్లయ్య?

కాళ్ళ మండలం గాంధీనగర్ కు చెందిన బర్రే పర్లయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి పూర్తిగా బానిసైన పర్లయ్య కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఎవరైనా పని చెబితే అది చేసుకుంటూ వచ్చిన కూలి డబ్బులతో మద్యం సేవించి ఎక్కడో ఓ చోట పడుకుంటుండేవాడు. పర్లయ్యకు ఊరిలో గాని మరి ఎవ్వరితోనూ ఏవిదమైన తగాదాలు లేవు. శత్రువులూ లేరు.

తిరుమాని శ్రీధర్ వర్మ ఎవరు..??

కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన శ్రీధర్ కు సుమారు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరువాత కాలంలో భీమవరంలో ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న యండగండి గ్రామానికి చెందిన ముదునూరి రేవతితో పరిచయం పెంచుకుని తాను క్షత్రియ కులానికి చెందిన వాడినని రేవతి కుటుంబ సభ్యులను నమ్మించి రేవతిని పెళ్ళి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా గాంధీనగర్ కు చెందిన ఓ నర్సుతో సహజీవనం చేస్తూ కాళ్ళ మండలంలో ఆక్వాసాగు చేస్తూ, గాంధీనగర్ లోనే కాపురముంటున్నాడు. అదే గ్రామానికి చెందిన పర్లయ్యను చెరువుల మీద పనికి తీసుకువెళ్ళేవాడు.

శ్రీధర్ వర్మ రెండవ భార్య అయిన రేవతి సోదరి తులసి. ఆమె భీమవరంలో ఓ షాపులో పని చేసుకుంటూ యండగండిలో ఇంటిని నిర్మించుకుంటుంది. ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించగా వారి పేరుతో గృహ నిర్మాణ సామాగ్రిని అందించాడు శ్రీధర్ వర్మ. దీనిలో భాగంగా తులసి విద్యుత్ సామాగ్రి కావాలని కోరగా వాటి బదులు డెడ్ బాడీ పార్సిల్ వస్తే విద్యుత్ సామాగ్రి అనుకుని ఇంటివద్ద దించమని తులసి చెప్పింది. సాయింత్రం డ్యూటీ నుంచి వచ్చిన తులసి పార్సిల్ ఓపెన్ చేయగా డెడ్ బాడీ బయట పడింది. వెంటనే ఈ విషయాన్ని తాను పనిచేసిన ఓనర్ కు చెప్పగా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

డెడ్ బాడీ పార్సిల్ ఎలా వచ్చింది..??

ఉండి మండలం ఉణుదుర్రు గ్రామ శివారు సాగిపాడు పరిదిలోని తాడేపల్లిగూడెం రోడ్డులో ఓ ఎర్ర కారుతో వచ్చిన శ్రీధర్ వర్మ అటుగా వెళుతున్న ఆటోను ఆపి తన కారు చెడిపోయిందని ఈ పార్సిల్ ను యండగండిలోని తులసి ఇంటి వద్ద దించాలని రూ.300 రూపాయిలు కిరాయికి మాట్లాడి పంపాడు. అయితే పార్సిల్ లో డెడ్ బాడీ బయట పడటంతో ముందుగా పోలీసులు ఆటో డ్రైవర్ ను పట్టుకుని విచారించారు. తద్వారా శ్రీధర్ వర్మను, రేవతి ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో కొంచెం పురోగతి కనిపించింది. మిగిలిన విషయాలు రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

TOP STORIES