ఈ సినిమా గురించి విశ్లేషించే ముందు..
సినిమా మొత్తం ఒక్కటంటే ఒక్క అసభ్యకర దృశ్యాలు లేకుండా అందరూ హాయిగా పిల్లా పాలపలు, కుటుంబమంతా కలిసి థియేటర్‌కు వెళ్లి హాయిగా సినిమా చూసేలా క్లీన్ మూవీని తీసిన దర్శకుడు, నిర్మాతలను అభినందిద్దాం…
నేను పెద్దగా సినిమాలు చూడను… ఇప్పుడొస్తున్న సినిమాలు చూడను… ధైర్యం చేసి, మన సినిమావాళ్లు రాయించుకునే రివ్యూలు చూసి మోసపోయి బాహుబలి, కల్కి సినిమాలు చూసి మూర్చపోయాను. దాంతో మళ్లీ కొత్త సినిమాలు చూడాలంటే సాహసం చేయలేకపోయాను. అందువల్ల చాలా రోజుల తర్వాత సినిమా థియేటర్‌కు వెళ్లి తండేల్ సినిమా ఈ రోజే చూశాను. దీనికి కారణం…ఇది ఒక యధార్థ సంఘటనకు సంబంధించిన సినిమా.. శ్రీకాకుళం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి తమకు తెలీకుండా పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించి వారి చేతుల్లో బంధీ అయి పాకిస్థాన్ జైళ్లలో అష్టకష్టాలుపడి చివరకు భారత ప్రభుత్వ చొరవతో విడుదలై తిరిగి సొంతూళ్లకు చేరుకున్న జాలర్ల జీవితాలకు సంబంధించిన కథ ఇది. ఈ సంఘటనల గురించి నాకు బాగా తెలుసు. అయితే దాన్ని వెండితెరమీద ఎలా ఆవిష్కరించారో చూద్దామనే కుతూహలంతోనే ఈ సినిమాను చూశాను.
తండేల్ సినిమా చాలా గొప్ప సినిమా కావాల్సి ఉండేది. కానీ కాలేదు.
తండేల్ సినిమా గొప్ప ఆర్ట్ సినిమా కావాల్సి ఉండేది… కానీ కాలేకపోయింది
తండేల్ సినిమా గొప్ప అవార్డు సినిమా కావాల్సి ఉండేది… కానీ కాలేకపోయింది (అవార్డు వస్తుందో రాదో తెలీదు. ఎందుకంటే అవెలా ఇస్తారో అందరికీ తెలిసిందే)
దీనికంతటికీ ఒకే ఒక కారణం…సంగీతం. ఈ సినిమాకు పెద్ద డిజాస్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమే..
ఆయనకు బదులుగా ఈ సినిమా ఇళయరాజా లేదా ఏఆర్ రెహ్మాన్, లేదా ఎంఎం కీరవాణి, సందీప్ చౌతా లాంటి సంగీత దర్శకుల చేతిలో పెట్టి ఉంటే ఈ సినిమా వేరే లెవల్‌కు వెళ్లేది, కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు.
ఈ సినిమా కేన్వాస్ వేరు.. డీఎస్పీ జానర్ వేరు. ఆయన పక్కా కమర్షియల్ సినిమాల సంగీత దర్శకుడు మాత్రమే.
ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. దీన్ని మరచిపోయారు అంతే.
ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఒక సామాజిక వర్గం గురించి తీసిన సినిమా.
వీటన్నిటికీ మించి
ఇదో స్వచ్ఛమైన ప్రేమకథ.
భావోద్వేగాలు నిండుగా ఉండే ప్రేమ కథ.
ఇలాంటి సినిమాలకు సినిమా తీసే విధానం ఎంత గొప్పగా ఉండాలో
దానికి అందించే సంగీతం కూడా అంతేలా ఉండాలి…
ఈ సినిమాలో లోపించిందే సంగీతం.
దర్శక, నిర్మాతలు ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాలేదు.
నిశబ్దం…. కూడా సంగీతమే…
ఈ సినిమాలో దాదాపు సంగం సీన్లులో సంగీతమే అవసరం లేదు. అక్కడ నిశబ్దమే సంగీతమవ్వాలి. సంభాషణలే సంగీతమవ్వాలి.
ఆ నిశబ్దాన్ని చక్కగా ఉపయోగించుకుని రణగోణ ధ్వనులు లేకుండా వీనుల విందైన సంగీతంతో
ఒక దృశ్యాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లి ప్రేక్షకుల మనుసుల్లో చెరగని ముద్రవేయగల సంగీత దర్శకులు మన వద్ద బహుకొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో అగ్రగణ్యలు ఇళయరాజా, ఏఆర్ రహ్మాన్‌లు..
ఈ సినిమాలో పెద్ద సమస్య ఏంటంటే..
సినిమా మొదల నుంచి చివరి దాకా దేవీశ్రీప్రసాద్ కాసింత గ్యాప్ కూడా ఇవ్వకుండా తన వద్దనున్న ఎలక్ట్రానిక్ వాయిద్యాలన్నీ వదలకుండా వాయించేసి విసుగెత్తించేశాడు.
దాంతో బాగా పండాల్సిన సీన్లు కూడా ఈ పేవల సంగీతంలో ఏమాత్రం పండకుండా ఆవిరైపోయాయి.
ఈ సినిమాలో కొన్ని దృశ్యాలుంటాయి.. వాటిని సంగీతంతోనే వేరే లెవల్‌కు తీసుకెళ్లగల సీన్లు అవి. కానీ అవన్నీ నిస్సారంగా నిష్ఫలంగా మారిపోయాయి. కేవలం సంగీతం కారణంగా.
ఇదో యథార్థ కథ.. స్వచ్ఛమైన ప్రేమకథ… సినిమా ఆసాంతం భావోద్వేగాలు సుసంపన్నంగా ఉండి ప్రేక్షకుడ్ని కట్టిపడేసే అవకాశాలు మెండుగా ఉన్న సినిమా. అలా పండాలంటే ఆ సినిమా నేపథ్య సంగీతం చాలా ముఖ్యం.
కానీ డీఎస్పీ సంగీతం సినిమాలో సీన్లు ప్రేక్షకుల మదిలోకి చొచ్చుకెళ్లనివ్వకుండా విసుగెత్తించేలా చేసింది. అంతిమంగా అవి నిస్సారంగా ఆవిరైపోయాయి..
ఈ సినిమాలో సంగీతం కారణంగా ఇలా నిస్సారమైపోయిన సీన్లు కోకొల్లలు… కానీ అవగాహన కొరకు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం..
గంగపుత్రుల బృందం ఒకటి సముద్రంపైన చేపల వేటకు వెళతారు. సముద్రంలో సెల్‌ఫోన్ సిగ్నళ్లు ఉండవు.
సముద్రంపైకి వెళ్లిన వాళ్లు ఏమయ్యారో ఇక్కడ తీరానికి ఈవల ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఉండదు, ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారో అనేది సముద్రంపైన చేపల వేటలో ఉన్న జాలర్లకు తెలీదు. ఒక్కసారి వెళితే దాదాపు రెండు మూడు నెలలు ఇంటిపట్టున రారు… ఈ సమయంలోనే ఒక జాలరి భార్య చనిపోతుంది. ఆ విషయం అతడికి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు తెలీదు.
ఆయన సముద్రంలో చేపల వేటలో ఉండగానే అతడి భార్య అనారోగ్యంతో చనిపోతుంది. ఆమెకు ఊళ్లో జనమే అంత్యక్రియలు చేసి తీరంలోని ఇసుక సమాధుల్లో పూడ్చేస్తారు. తిరిగి ఇంటికొచ్చిన ఆయన చివరకు తన భార్య సమాధి కూడా ఏదో తెలీని పరిస్థితి ఏర్పడి కన్నీరు మున్నీరైపోతాడు. ఇది ఎంతో భావోద్వేగభరితమైన సన్నివేశం. హృదయాన్ని కలచివేసే సన్నివేశం. ఇలాంటి సన్నివేశాలు సంగీత దర్శకులకు వరం లాంటివి. తమ సంగీత సృజనతో ఇలాంటి సన్నివేశాలను పతాకస్థాయికి తీసుకెళ్లగలుగుతారు. కానీ దేవీ శ్రీప్రసాద్ సంగీతం ఇంత గొప్ప సన్నివేశాన్ని చాలా పేలవంగా చంపేసింది. ఒక మూసస్థాయి సంగీతంతో అసలు ఆ సీను ప్రేక్షకుల మనుసులపై కనీస ముద్ర కూడా వేయలేనంతంగా చేసేశారు. ఇలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.
గుజరాత్‌కు వెళ్లిన సాయిపల్లవి, అక్కడ సేటును ఎదురించి ఒంటరిగా హార్బర్‌లో ఆందోళన చేసే దృశ్యం. ఢిల్లీలో నాయకులను కలవడానికి పడే కష్టం… ఆ అమ్మాయి ఎంతగా నటించినా, ఈ సీన్లు ఎంత బాగా చిత్రీకరించినా, సంగీతం వాటిని ఆ స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయింది. దాంతో ప్రేక్షకులపైన ఆ సీన్లు కనీస ప్రభావాన్ని కూడా చూపలేకుండా ముగిసిపోయాయి. ఇంకా చెప్పాలంటే ప్రేక్షకులు కనీసం థియేటర్ దాటి వచ్చేంత వరకు కూడా వారి మనసుల్లో అవి ముద్రపడేంతలా కూడా చేయలేకపోయాయి.
క్లైమాక్స్‌కు సైతం నిస్సారమైన సంగీతం
ఈ సినిమా గురించి చెప్పాలంటే
ఇది ఒక రోజా తరహా సినిమా..
దీని క్లైమాక్స్ ఎంతో భావోద్వేగభరితంగా ఉండాలి.
ఒక రోజా లాంటి సినిమా.. దీని క్లైమాక్స్ ఎంతో భావోద్వేగభరితంగా ఉంటుంది, ఉండాలి. క్లైమాక్స్ సన్నివేశాలను సంగీతం పతాకస్థాయికి తీసుకెళ్లగలగాలి. అవి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయడంలో 90శాతం సంగీతమే ప్రభావం చూపుతుంది. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ సంగీతం చాలా నిస్సారంగా, నిస్తేజంగా, మామూలు సాధారణ రొటీన్ తెలుగు కమర్షియల్ సినిమా స్థాయికంటే కూడా తక్కువగా సంగీతం అందించారు. ఇంకా చెప్పాలంటే సంగీతంతో సినిమా మొత్తాన్ని విసుగెత్తించేశారు.
డైలాగ్సును చంపేసిన డీఎస్పీ
దర్శకుడు ధైర్యం చేసి చెప్పలేకపోయాడో ఏమో నాకు తెలీదు కానీ, ఇందులో మంచి మంచి డైలాగులు కూడా ఉన్నాయి. కానీ వాటిని కూడా ప్రేక్షకులు సరిగ్గా వినలేనంతగా, విన్నా వాటిని మనసులో గుర్తుపెట్టకోలేనంతగా దేవీశ్రీప్రసాద్ తన వాయిద్యాల హోరుతో మోతెక్కించి విసుగెత్తించేశారు. ఫలితంగా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాల్సిన గొప్ప భావోద్వేగభరితమైన డైలాగులు కూడా సంగీత హోరులో చచ్చిపోయాయి. ఈ సినిమాలో ఏ కోశాన కూడా డీఎస్పీ సంగీతం ఫరవాలేదు అనేంత స్థాయిలో కూడా సంగీతం అందించలేకపోవడం పెద్ద అవరోధం.
సాగదీత…
యథార్థ సంఘటన అయిన ఈ సినిమాను రెండున్నరగంటల్లో సినిమాగా తీయడం కత్తిమీద సాములాంటిదే. అయితే దర్శకుడు కూడా చాలా వరకు ఈ సినిమాను సాగదీతకు ప్రాధాన్యం ఇచ్చారు. కొన్ని చోట్ల మరింత హృద్యంగా తీయాల్సిన దృశ్యాలను ఠప్ మని మధ్యలో వదిలేశాడు అని చెప్పాలి. ఉదాహరణకు క్లైమాక్స్‌లో సాయిపల్లవి లైట్ హౌస్ మీద హీరో కు సారీ చెప్పి, నువ్వు కూడా నాకు సారీ చెప్పరా అంటుంది. అక్కడ సీను ఇంకా ఎంతోగొప్పగా పండించేలా తీసి ఉండొచ్చు..కానీ దాన్ని అలా పైకి తీసుకెళ్లి ఏమీ లేకుండా అమాంతం పాతాళానికి వదిలేసినట్లుగా సీను వదిలేశారు. దాంతో క్లైమాక్స్ అనుకున్నంత గొప్పగా పండించలేకపోయారనే చెప్పాలి.
పాకిస్థాన్ జైల్లో అనవసర సీన్లు
మన భారతీయ జాలర్లు పాకిస్తాన్ జైల్లో బంధిస్తారు. నిజానికి ఈ సంఘటనకు సంబంధించి సినిమాలో అనవసర సాగదీత, అసహజమైన సన్నివేశాలు అల్లుకుని కాస్తంత అబాసుపాలయ్యారు. ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ పాకిస్తాన్‌లో అల్లర్లు జరుగుతాయి. అప్పుడే జాలర్లను జైలు నుంచి బయటకు తీసుకెళుతుంటే వీధుల్లో ఆందోళనకారులు ఆ వ్యానును అడ్డగిస్తారు. అన్ని లక్షల మంది జనం వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే తెలుగు హీరో వాళ్లందర్నీ కొట్టి అక్కడి నుంచి పారిపోయి మళ్లీ జైలుకు తిరిగి వచ్చే సన్నివేశం, ఇలాంటి సీరియెస్ సినిమాలో కామెడీ ఉండి అపహాస్యం పాలైంది. కమర్షియల్ సినిమాలో ఇలాంటివి చెల్లుతాయి. కానీ ఇది కమర్షియల్ సినిమా కాదు, ఇవి హీరో ఇమేజ్‌తో నడిచే సినిమాలు కావు. కథే ఈ సినిమాలో హీరో, హీరోయిన్. ఈ లాజిక్‌ను దర్శకుడు మిస్ అయినట్లు కనిపించాడు. దీనికి బదులుగా పాకిస్థాన్ జైల్లో జాలర్లు పడ్డ అవస్థలు, కష్టాల గురించి తెరకెక్కించి ఉంటే సినిమా మరో లెవల్ కి వెళ్లేది.
నటీనటులంతా భేష్..
ఈ సినిమాలో నటీనటులను ఎవర్వీ తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎవరికి వాళ్లు తమతమ పాత్రలో తగినంత న్యాయం చేశారు. ఎక్కడా అసహజ నటనకు తావు లేకుండా సహజ నటనతోనే మెప్పించారు.
శ్రీకాకుళం యాస సరిపోలేదు
ఇందులో హీరో హీరోయిన్లు శ్రీకాకుళం మాండలికాన్ని పలికడంలో చాలా వరకు కష్టపడ్డారు. అయితే అది పూర్తీ స్థాయిలోసఫలీకృతం కాలేకపోయారనే చెప్పాలి. శ్రీకాకుళం మాండలికం చాలా గొప్పది, వైవిధ్యభరితమైంది, అది పలకడం అంత సులభం కాదు. సాయిపల్లవి, నాగ చైతన్యలు డబ్బింగ్‌లో బాగా కష్టపడి చెప్పినా, చాలా వరకు అది వారికి సూట్ అవ్వలేదు.
చివరగా…ఒక మంచి సినిమా గురించి లోతుగా విశ్లేషించాల్సి వస్తే పైన చెప్పినవన్నీ చిన్న లోపాలు…
ఓవరాల్‌గా… ఇది మంచి సినిమా… అందులో అనుమానం లేదు..అందరూ థియేటర్‌కి వెళ్లి చూడదగ్గ సినిమా…
శ్రీకాకుళం జిల్లాలో జాలర్ల కుటుంబాల్లో జరిగిన యథార్థసంఘటన, వారి కష్టాలు, కన్నీళ్ల గురించి కొంతైనా తెలుసుకోవడానికి అవకాశం కల్పించే సినిమా…
వీటిన్నిటికి మించి సినిమా మొత్తం కనీసం ఒక్కటంటే ఒక్క భూతు డైలాగు, డబుల్ మీనింగ్ డైలాగు, ఒక్కటంటే ఒక్క అసభ్యకరమైన దృశ్యం లేని కంప్లీట్…క్లీన్ సినిమా…
-ఎ. కిశోర్‌బాబు