Andhrabeats

తలకోన అడవిలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

Elephants attack in Ap

మహా శివరాత్రి సందర్భంగా కాలినడకన శైవక్షేత్రానికి వెళ్లి శివయ్యను దర్శించుకొందామని వెళ్తున్న భక్తులపై.. మార్గం మధ్యలో గజరాజుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది ప్రాణ భయంతో పరుగు తీశారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులైన భక్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శివరాత్రి సందర్భంగా దశాబ్దాలుగా వైకోట నుంచి శేషాచలం దట్టమైన అటవీ మార్గం మీదుగా ఈ ప్రాంత ప్రజలు గుంపులుగా చిత్తూరు జిల్లా తలకోనకు కాలినడకన ఏటా వెళుతుంటారు.

గతేడాది నుంచి ఈ మార్గంలో రాకపోకలను ఫారెస్టు అధికారులు నిషేధించారు. ఈ మార్గంలో వెళ్లేవారిని అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. అయితే ప్రమాదమని తెలిసినా రైల్వేకోడూరు మండలం నుంచి దాదాపు 26 మంది భక్తులు కలిసి శివరాత్రికి తలకోన శివాలయనికి వెళ్దామని నిర్ణయించుకొని సోమవారం సాయంత్రం బయలు దేరారు. అటవీ శాఖ అధికారులకు తారస పడకుండా వై కోట నుంచి శేషాచల అటవీ ప్రాంతంలోని గుండాల కోన మార్గంలో వినాయకుడి గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి తలకోనకు అడ్డదారైన కోడి వెంగమ్మ బావి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఏనుగుల మంద ఎదురు పడింది. వాటిని అదిరించి వెళ్లగొట్టేందుకు తమ వద్ద ఉన్న పాత్రలతో పెద్ద శబ్దాలు చేశారు. దీంతో ఏనుగులు తిరగబడి భక్తులపై ఒక్కసారిగా దాడి చేశాయి. అందరూ భయభ్రాంతులకు గురై చెల్లాచెదురుగా ప్రాణ భయంతో ముళ్ల్లపొదల్లో బిక్కు బిక్కుమంటూ దాక్కొన్నారు. కొంత మంది పారిపోయారు. ఏనుగులకు దొరికిన రైల్వేకోడూరు మండలం ఉల్లగడ్డపోడుకు చెందిన వంకాలయ దినేష్‌(34), రైల్వేకోడూరు మండలం కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందిన తుపాకుల మణెమ్మ(40), తిరుపతి చెంగలరాయుడు(35)ను కాళ్లతో తొక్కి చిందర వందర చేసి చంపివేశాయి. దీంతో వారు అక్కడికి అక్కడే మృతి చెందారు. అమ్ములు అనే బాలికను గున్న ఏనుగు తొక్కడంతో కాలు విరిగింది. దాడిలో పరిగెల రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడి ముళ్లపొదల్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నాడు. కాసేపటికి ఏనుగులు వెళ్లిపోవడంతో తప్పించుకొన్న భక్తులు ఫోన్‌ సిగ్నల్‌ ఉన్న ప్రాంతానికి చేరుకొని బంధువులకు సమాచారం ఇచ్చారు.

మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఈ సమాచారం తెలిసిన అటవీ శాఖ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి, దట్టమైన అడవి కావడంతో ఎంత మంది చనిపోయారో ఉదయం వరకు అర్థం కాలేదు. అతి కష్టంమీద ముళ్ల పొదల్లో మృతదేహాలను గుర్తించి రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని తిరుపతి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పారిపోయిన వారు బ్రతుకుజీవుడా అంటూ ఇళ్లకు చేరారు. ఇంకా ఎవరైనా అడవిలో చిక్కుకొని ఉన్నారా అనే అనుమానంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వైకోట గ్రామ ప్రజలు విషయం తెలిసిన వెంటనే.. అడవిలోకి వెళ్లి సహాయక చర్యలకు సహకారం అందించారు. దశాబ్దాలుగా గుండాకోన, తలకోనకు కాలినడకన భక్తులు ఏటా వెళ్తున్నా.. ఎన్నడూ ఇటువంటి సంఘటన జరగలేదని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు.

అడవి బయటికి వస్తున్న వన్యప్రాణులు
వేసవి కాలం కావడంతో అడవుల్లో మేత, తాగునీరు లేక పోవడంతో వన్యప్రాణులు అటవీ సమీప ప్రాంతాల్లోని పొలాల్లోకి వస్తున్నాయి. తరచూ పండ్ల తోటలపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల ఏనుగుల గుంపు గాదెల అటవీ ప్రాంతంలోని అరటి తోటను ధ్వంసం చేసింది. వైకోట నుంచి గుండాలకోన, తలకోనకు వెళ్లే మార్గాలను.. ఎవరూ వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు మూసివేశారు. అనుమతులు లేకుండా అడవిలోకి వెళ్లకూడదని బందోబస్తు ఏర్పాటు చేశారు.

తలకోనకు వెళ్తూ వైకోట సమీప శేషాచల అడవిలో ఏనుగుల దాడిలో మృతి చెందిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున గాయపడ్డ వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలోని శైవక్షేత్రాలకు వెళ్లడం జరుగుతుందని, అటవీశాఖ అధికారులు అడవుల్లో వన్యప్రాణులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ముందస్తుగా పరిశీలించి, అప్రమత్తంగా చేయాల్సి ఉంటుందని అన్నారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు చనిపోయరనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఒక్కొక్క ప్రాణానికి రూ.10 లక్షలు ప్రకటించిందని మృతి చెందిన కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

 

TOP STORIES