ధార్ గ్యాంగ్.. దొంగతనాల్లో ఈ గ్యాంగ్ స్టైలే వేరు. ఎక్కడి నుంచో వచ్చి రాష్ట్ర సరిహద్దుల్లో దజ్జాగా దోపిడీలు చేసి వెళ్ళిపోతారు. ఇటీవల అనంతపురంలో జరిగిన భారీ దోపిడీ ఈ గ్యాంగ్ పనే అని తేలింది. అనంతపురం నగర శివారు శ్రీనగర్ కాలనీలో కొన్ని రోజుల కిందట జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు, రూ.19.35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలను జిల్లా ఎస్పీ జగదీష్ ఆదివారం మీడియాకు వివరించారు. శ్రీనగర్ కాలనీలో కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి, రంజిత్‌రెడ్డి, శివశంకర్‌నాయుడు ఇళ్లల్లో గత నెల 22న చోరీలు జరిగాయి. వెంకటశివారెడ్డి కుమార్తె పెళ్లికి తెచ్చిన బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. మొత్తం రూ.2.13 కోట్ల విలువైన సొత్తును దోచుకెళ్లినట్టు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఛేదించడానికి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చోరీలు జరిగిన ఇళ్లల్లో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో ఆధారాలను సేకరించారు. రెండు టీంమ్‌లు అనంతపురంలో గాలించి.. నారు పచావర్, సావన్ అలియాస్ శాంతియదుడ్వే, సునీల్‌లను అరెస్ట్ చేశాయి. మహబత్, మోట్ల అనే ఇద్దరు పరారీలో ఉండగా.. వీరి కోసం రెండు టీంమ్‌లు మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా మారుమూల ప్రాంతాలకు వెళ్లి గాలిస్తున్నాయి.
ఈ చోరీలో మొత్తం నలుగురు పాల్గొన్నారు. గత నెల 16న స్వగ్రామాల నుంచి చోరీలు చేయాలనే తలంపుతో బయలుదేరి ఇండోర్, ఇటార్చి వరకు బస్సుల్లో వచ్చారు. అక్కడి నుంచి నేరుగా తమిళనాడు సేలంకు రైల్లో చేరుకున్నారు. అటు నుంచి ధర్మపురికి వెళ్లి రెండు బైక్‌లను దొంగిలించి వాటిపై గత నెల 21న అనంతపురంలో రెక్కీ నిర్వహించారు. ఆ మర్నాడు తెల్లవారుజామున చోరీలకు పాల్పడ్డారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి వాటాలు పంచుకున్నారు. నారు పచావర్, సావన్‌లు హైదరాబాద్‌లోనే ఉంటూ దొంగ సొత్తును విక్రయించే ప్రయత్నం చేశారు. మిగిలిన ఇద్దరూ మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోయారు. వజ్రాలు పొదిగిన ఆభరణాలను చూసి హైదరాబాద్‌లో రిసీవర్లు(దొంగ సొత్తును తీసుకునే వారు) భయపడ్డారు. దీంతో అక్కడ అమ్మడం అసాధ్యమని గ్రహించి తిరిగి బెంగళూరుకు పయనమయ్యారు. అక్కడా కుదర్లేదు. దీంతో తిరిగి అనంతపురం వచ్చారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌కు చెందిన రిసీవర్ రమేష్‌ను ఫోన్‌లో సంప్రదించి చోరీ సొత్తును కొనాలని కోరారు. అందులో దిట్ట అయిన రమేష్ తన కుమారుడు సునీల్‌ను అనంతపురం పంపాడు. సునీల్ మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా నుంచి బైక్‌పైనే అనంతపురం వచ్చాడు. నగరంలోనే బేరం ఆడుతుండగా వీరు ముగ్గురూ పోలీసులకు చిక్కారు. నారు పచావర్‌పై ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్టాల్లో 32 కేసులు, మహబత్‌పై నాలుగు రాష్ట్రాల్లో 29కి పైగా కేసులున్నాయి. సునీల్‌పై 9 కేసులు, ఇతని తండ్రి రమేష్‌పై వివిధ రాష్ట్రాల్లో 34 కేసులున్నాయి.
ధార్ గ్యాంగ్‌లో మొత్తం 60 మంది సభ్యులున్నారు. ఐదారుగురు కలిసి గ్యాంగ్‌లుగా ఏర్పడి చోరీలు చేస్తారు. వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా టాండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందిన వారే. వ్యవసాయ కూలి పనులు వీరి వృత్తి కాగా, దొంగతనాలు చేయడం వీరి ప్రవృత్తి.