Andhrabeats

నాకు ప్రజలే హైకమాండ్‌ : చంద్రబాబు 

Ap Cm Chandrababu in Pension Distribution Programme
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని, పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే చెట్లు కొట్టేసి, పరదాలు కట్టి, జనాన్ని బలవంతంగా తరలించేవారని, తాను అలాంటి సీఎం కాదని, సాదాసీదాగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులు చూసుకోవడమే తన బాధ్యత అని అన్నారు. తనకు హైకమాండ్‌ అంటూ ఏం లేదని, 5 కోట్ల ప్రజలే తనకు హైకమాండ్‌ అని ముఖ్యమంత్రి అన్నారు. పల్నాడు జిల్లా నరసరావు పేట నియోజకవర్గం యలమందలలో పించన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
లబ్దిదారులకు ఇంటికెళ్లి పింఛను అందజేత– స్వయంగా కాఫీ పెట్టిన సీఎం
లబ్దిదారులు తలారి శారమ్మ, ఏడుకొండలు ఇంటికి వెళ్లి వారికి  ముఖ్యమంత్రి పింఛను అందజేశారు. ఏడుకొండలు ఇంట్లో  ముఖ్యమంత్రి స్వయంగా కాఫీ చేశారు. కుటుంబసభ్యులకు ఇచ్చి తానూ తాగారు. అనంతరం వారితో మాట్లాడి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఏడుకొండలు కుమారుడు ఇల్లు కట్టుకునేందుకు రుణంతో పాటు అతనికి స్వయం ఉపాధి కోసం బీసీ కార్పొరేషన్‌ నుంచి రూ.5 లక్షల రుణం అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ఏడుకొండలు సొంతగా నడుపుతున్న టైర్ల షాపుకు ప్రభుత్వం నుంచి రూ. 60 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరో లబ్దిదారు శారమ్మ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కరోనాలో భర్తను కోల్పోయిన శారమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డాక్టర్‌ చదువుదామనుకుంటున్న శారమ్మ కుమార్తెకు నీట్‌ కోచింగ్‌ ఇప్పించాలని, కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రూ. 3 లక్షల రుణం అందించాలని అధికారులను ఆదేశించారు.
పేదలకు పెన్షన్‌ ఇచ్చిన ఘనత టీడీపీదే
దేశంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఒక్క ఏపీనే. అలాగే ప్రతినెలా పేదలకు రూ. 4 వేలు పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రమూ ఏపీనే. అధికారంలోకి రాగానే ఏప్రిల్‌ నెల నుంచి పింఛను ఇస్తామన్న హామీ నిలబెట్టుకున్నాం. ఒక రోజు ముందుగా 31వ తేదీనే పింఛను అందిస్తున్నాం. మంచి నాయకత్వం ఉంటే అంతా మంచే జరుగుతుంది. ప్రతి లబ్దిదారునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్‌ అందాలన్నదే నా ఆశయం . సిబ్బంది ఇంటి దగ్గర పెన్షన్‌ ఇవ్వకుండా ఆఫీస్‌లో ఇస్తే ఊరుకోం. వెంటనే మెమో పంపిస్తాము.  ఫోన్లో జీపీఎస్‌ ద్వారా వెంటనే సమాచారం మాకు వచ్చేస్తుంది.
గోదావరి జలాలతో తెలుగుతల్లికి జలహారతి
పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. నదుల అనుసంధానంతో నీటి కొరత తీర్చి, కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. వరదలతో గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతోంది. ఈ సంవత్సరం కృష్ణా నదికి వచ్చిన వరదలతో  800 టీఎంసీలు సముద్రంలోకి పోయాయి. గోదావరి నుంచి 300 టీఎంసీల నీటిని ఒడిసిపట్టి బనకచర్లకు తరలిస్తే మన రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుంది. ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. టీడీపీ సభ్యత్వాలు 90 లక్షలు దాటడం రికార్డు

TOP STORIES