ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తన సోదరుడు నాగబాబుకి రాజకీయంగా ప్రాధాన్యం కల్పించగలిగారు. త్వరలో ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన్ను మంత్రి ఎన్డీయే కూటమి తరఫున మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత చట్టసభలో కొనసాగేందుకు వీలుగా ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వనున్నారు.
ముగ్గురు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఇప్పించాలని పవన్ కళ్యాణ్ భావించారు. అయితే మూడింటిలో రెండు టీడీపీకేనని చెప్పిన చంద్రబాబు మిగిలిన ఒక స్థానాన్ని బీజేపీ, జనసేనలో ఒకరు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇందుకోసమే పవన్ కళ్యాణ్ పది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాజ్యసభ స్థానం గురించి అమిత్‌షాతో చర్చించారు. అయితే ఆ స్థానం తమకే కావాలని, రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకే తిరిగి దాన్ని కేటాయిస్తామని బీజేపీ పెద్దలు చెప్పడంతో పవన్ వెనక్కి వచ్చేశారు.
టీడీపీకి కేటాయించిన రెండింటిలో ఒకదాన్ని రాజీనామా చేసిన బీద మస్తానరావుకే ఇవ్వగా మరో స్థానాన్ని లోకేష్‌కి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్త సానా సతీష్‌కి ఇవ్వాలని నిర్ణయించారు. రాజీనామా చేసిన వారికే తిరిగి సీట్లిస్తే అభ్యంతరం లేదని, కానీ కొత్త వ్యక్తి సానా సతీష్‌కి ఇచ్చేపక్షమైతే నాగబాబు పరిస్థితి ఏమిటని జనసేన వాదించినట్లు తెలిసింది. దీంతో నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు.
నాగబాబు గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఒక దశలో ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో ఇంటిని తీసుకుని పని చేయడం కూడా ప్రారంభించారు. కానీ పొత్తులో ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో ఆయన వెనక్కిరావాల్సివచ్చింది. ఆ తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగినా అదీ కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు ఏకంగా మంత్రివర్గంలోనే ఛాన్స్ దొరకబుచ్చుకున్నారు. ఎట్టకేలకు అన్నకు పవన్ కళ్యాణ్ పదవి ఇప్పించుకోగలిగారు.