Andhrabeats

నా పాలన ఎలా ఉందో చెప్పండి : చంద్రబాబు

తన పాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎపీ సీఎం చంద్రబాబు ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై IVRS (Interactive Voice Response System) ఫోన్లు చేసి అమలు తీరును తెలుసుకుంటామని ప్రకటించారు. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల అమలుపై వారి అభిప్రాయం కోరుతూ IVRS కాల్స్ వెళతాయి. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకోవాలని భావిస్తోంది.

ఇంటింటికీ పింఛన్లు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల లబ్దిదారుల నుంచి ఈ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని భావిస్తున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా లేదా…..దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు.

పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీల అమలుపైనా ప్రజాభిప్రాయం తెలుసుకోనున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు, మద్యం కొత్త పాలసీ, అమ్మకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. పథకాలు, కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌరసేవలపై కూడా IVRS ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. నేరుగా ప్రజల నుంచి వచ్చే ఈ సమాచారంలో ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింత మెరుగుపరచనున్నారు.

ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రజలు ఒపిగ్గా తమ అభిప్రాయాలు చెప్పాలని చంద్రబాబు కోరుతున్నారు.

ఐవిఆర్ఎస్ విధానం ద్వారా వచ్చే ఖచ్చితమైన అభిప్రాయాల ద్వారా గతంలో మంచి ఫలితాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో చంద్రబాబు ఇదే విధానాన్ని పాటించారు. అలాగే విజయవాడ వరదల సమయంలో ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే సాయంపైనా కాల్స్ ద్వారా సమాచారం తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో దీన్ని విరివిగా వాడాలని నిర్ణయించారు.

TOP STORIES