వచ్చే విద్యా సంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలని ఆర్థిక శాఖకు ఏపీ కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. పీఎం కిసాన్‌కు కేంద్రం డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలపై చర్చ జరిగింది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే పలు కీలక పథకాలకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యాసంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. పీఎం కిసాన్‌కు కేంద్రం డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
పాఠశాలల పునప్రారంభంలోపు మెగా డీఎస్సీ అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో మాట్లాడి కొత్త విద్యాసంవత్సరం ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ చెల్లింపులు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు.
ఒక్కొక్కటీ ప్రారంభిద్దాం…
మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు ముఖ్య అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రూ. 21వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సేవింగ్ నిధులు మళ్లించారని.. ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలనే దానిపై చర్చ జరిపారు. ఆర్ధిక వెసులుబాటు బట్టి ఒక్కో ఎన్నిక హామీ అమలు చేసుకెల్దామన్నారు సీఎం. ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఫించన్ పెంపు, అన్న కాంటీన్లు పునరుద్ధరణ, దీపం పథకం అమలు, మెగా డీఎస్సీ ప్రకటన చేశామని తెలిపారు. కొత్త ఏడాది ఆర్ధిక వెసులుబాటు బట్టి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి పథకాలు ఒక్కొక్కటీ ప్రారంభిద్దామని మంత్రులతో చంద్రబాబు అన్నారు. కళాశాలలకు ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ నేరుగా ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఎక్కడా విద్యార్థులు చదువుకు ఇబ్బంది పడకుండా కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ భారం విద్యార్థులపై లేకుండా కళాశాలలకు దశల వారీ చెల్లింపులు చేస్తూ విద్యాసంస్థలు, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు.
‘‘మనం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాల్సిందే’’ అని సీఎం అన్నారు. ఆర్టీసీ బస్‌లో ఉచిత ప్రయాణంపై మంత్రుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగిన తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ముందు అమలు జరుపాలని ఆయన కోరారు. ఫీజు రీ ఇంబర్సెంట్ కొంత విడుదల చేయాలని.. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎవరూ ఆపవద్ధని వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎస్‌కు కేబినెట్ చెప్పింది. ఈ విషయాన్ని కళాశాలల యాజమాన్యాలకు వెంటనే చెప్పాలని చంద్రబాబు ఆదేశించారు. రెవిన్యూ సదస్సులు వలన ఎన్ని దరఖాస్తులు వచ్చాయని.. ఎన్ని పరిష్కారం అయ్యాయని సీఎం ప్రశ్నించగా.. రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 13వేల కు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. సమస్యల కోసం అర్జీదారులు పదే పదే రాకూడదన్నారు. ఒకే సమస్యపై పదే పదే తిరగకుండా ఎంత త్వరగా పరీష్కారం చూపామన్నదే కీలకం కావాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.