Andhrabeats

పెళ్లి పీటలు ఎక్కనున్న పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకటదత్త సాయితో ఆమె వివాహం జరగనుంది. వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. పెళ్లి తేదీ, వివాహ వేదిక కూడా నిశ్చయమైంది. ఈ విషయంపై పీవీ సింధూ తండ్రి పీవీ రమణ మాట్లాడుతూ.. ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించిన నిర్ణయానికి వచ్చామని చెప్పారు. జనవరి నుంచి పీవీ సింధూ షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

డిసెంబర్ 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పీవీ సింధూ, వెంకటదత్త సాయి వివాహం జరగనుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులతో పాటు కొందరు సినీ, క్రీడా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈనె ల 20 నుంచి ఉదయ్ పూర్ లో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయని సమాచారం. అయితే, డిసెంబర్ 24న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ ఇప్పటి వరకు రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేతగా నిలిచారు. 2013లో వరల్డ్ ఛాంపియన్ షిప్ పతకంతో సింధూ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 2017లో వరల్డ్ ర్యాంకింగ్స్ లో తొలిసారి రెండో ర్యాంకుకు పీవీ సింధూ చేరుకుంది.

TOP STORIES