త్వరలో పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపుదామనుకున్న ఆ యువతి కలలను ఒక ప్రేమోన్మాది చిదిమేశాడు. ప్రేమికుల రోజే ఆమె జీవితాన్ని విషాదంలో ముంచేశాడు. తనను ప్రేమించడంలేదని ఒక యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బలవంతంగా నోట్లో యాసిడ్ పోసి తాగించి, ఆపై కత్తితో శరీరంపై ఇష్టానుసారం పొడిచి పైశాచికానందం పొందాడు. ఆ యువతి ప్రస్తుతం ప్రాణపాయస్థితిలో బెంగుళూరు ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది.
గుర్రంకొండ మండలంలోని నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెకు చెందిన దాసరి జనార్దన్, రెడ్డెమ్మల కుమార్తె గౌతమి(21) మదనపల్లెలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే బ్యూటీషియన్ కోర్సు చేసి ఓ బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం చేస్తోంది. మదనపల్లె పట్టణం అమ్మచెరువు మిట్ట ప్రాంతానికి చెందిన గణేష్(24) స్థానికంగా ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గౌతమిని గత ఏడాదిగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతని వేధింపులకు తట్టుకోలేక గౌతమి మూడునెలల కిందట మదనపల్లెలో ఉద్యోగం వదిలి సొంత గ్రామమైన ప్యారంపల్లెకు వచ్చేసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే గౌతమి తల్లిదండ్రులు పీలేరులో నివాసముంటున్న తన మేనత్త సౌభాగ్యమ్మ కుమారుడైన శ్రీకాంత్‌తో పెళ్లి ఖరారు చేశారు. శ్రీకాంత్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన గౌతమి, శ్రీకాంత్‌లకు నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏప్రిల్ 29 తేదీన పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే ఏడాదిగా గౌతమిని వేధించి లొంగదీసుకోవడానికి యత్నించిన గణేష్ ఆమెపై కక్ష పెంచుకొన్నాడు. 3 నెలలుగా స్వగ్రామంలో ఉండడంతో ఎలాగైనా ఆమెను ఆంతమొందించాలని పథకం పన్నాడు.
15 రోజుల కింద ప్యారంపల్లెకు వెళ్లి ముందుగానే రెక్కీ నిర్వహించి పథకం అమలుకు సిద్ధమయ్యాడు. గౌతమి ఇల్లు గ్రామానికి కొంచెం దూరంగా ఉంది. శుక్రవారం ఉదయం గౌతమి తల్లిదండ్రులు పాడి ఆవులకు పాలు పితకడానికి పొలం వద్దకు వెళ్లారు. ఇంట్లో గౌతమి ఒక్కతే ఉండడంతో గణేష్ ఇంట్లోకి చొరబడి గడియవేశాడు. వెంటనే తనతోపాటు తెచ్చుకొన్న యాసిడ్ బాటిల్‌తో ఆమెపై దాడి చేశాడు. బలవంతంగా నోట్లో యాసిడ్ పోసి తాగించాడు. తలపై కూడా పోశాడు. అంతటితో ఆగకుండా తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. శరీరంపై ఇష్టానుసారం పలుచోట్ల కత్తితో పొడిచాడు. ఆ తర్వాత గౌతమి సెల్‌ఫోన్ తీసుకొని పరారయ్యాడు. వీధి చివర ఇలు ఉండడంతో పాటు పరిసర ప్రాంతాల ఇళ్ల రైతులు పొలాల వద్దకు వెళ్లడంతో ఈ విషయం ఎవరి కంట పడలేదు. గౌతమి తల్లి తన సెల్‌ఫోన్‌ను ఇంటి వద్దనే ఉంచి వెళ్లడంతో తల్లి ఫోన్‌లో నుంచి తండ్రికి జరిగిన సంఘటనపై సమాచారం ఆందించింది. పొలం వద్ద నుంచి తల్లిదండ్రులు పరుగులు తీస్తూ ఇంటికి చేరుకొన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. వెంటనే చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకొని 108 వాహనానికి సమాచారం అందించారు. గౌతమిని 108 వాహనంలో గుర్రంకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి వైద్యసేవల నిమిత్తం తరలించారు. అక్కడ గౌతమిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యసేవల నిమిత్తం బెంగళూరుకు తరలించాలని సూచించారు. దీంతో కుటుంభసభ్యులు బాధితురాలిని బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు.
గౌతమి కుటుంబం వ్యవసాయ జీవనాధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. దాసరి జనార్ధన్, రెడ్డెమ్మలకు ఇద్దరు సంతానం. కుమారుడు రాజేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె గౌతమి. ఇంటి వద్ద తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయంతో పాటు పాడిఆవుల పోషణ చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లల్ని ఉన్నత విద్యావంతుల్ని చేయాలని తమ కష్టం వాళ్లుపడకూడదని తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి బిడ్డల్ని ప్రయోజకుల్ని చేశారు. వారం రోజల కిందట కుమార్తెకు వివాహం నిశ్చయం జరగడంతోపాటు త్వరలో పెళ్లి జరుగుతుందని అనుకొంటున్న సమయంలో ఇలా ఒక ప్రేమోన్మాది దారుణంగా పాల్పడడం అందరినీ కలచి వేసింది.