Andhrabeats

భక్తుల మృతి కలిచివేసింది: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు : చంద్రబాబు

‘పవిత్ర దివ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన బాధాకరమైన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. భక్తుల మరణ వార్త విని ఎంతో బాధపడ్డా. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ అధికారులను ఆదేశిస్తున్నా. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఒక వెంకటేశ్వరస్వామి భక్తుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాపై ఉంది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నా.’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి, దుర్ఘటనపై అక్కడే అధికారులను ప్రశ్నించారు. అనంతరం స్విమ్స్, పద్మావతి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి పరామర్శించారు. ఆసుపత్రుల్లోనే రెండు గంటల పాటు ఉండి గాయపడ్డ అందరినీ సీఎం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయడు, ఈఓ శ్యామలారావు, మంత్రులు, అధికారులతో సమీక్షించారు.

మృతి చెందిన వారికి రూ. 25 లక్షలు… తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 5 లక్షల పరిహారం

‘తిరుమల కొండపై ఇంతటి విషాదం జరగడం నన్ను ఎంతో బాధిస్తోంది. తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు విడిచారు. లావణ్య(విశాఖ), శాంతి(విశాఖ), నాయుడు బాబు(నర్సీపట్నం), రజనీ(విశాఖ), నిర్మల (కోయంబత్తూర్), మల్లిక(మెట్టు సేలం) భక్తులు మరణించారు… వారి ఆత్మకు శాంతికలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తాము. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. చికిత్స పొందేవారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుంది. ఈ ఘటనలో మరో 33 మంది గాయపడ్డారు. వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. వీరందరికీ వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కల్పిస్తాం. దర్శనం అనంతరం రవాణా ఖర్చులు భరించి వారిని ఇంటికి చేరుస్తాం.’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

భక్తుల మరణవార్త కలచివేసింది

‘విశాఖపట్నంలో బుధవారం ప్రధానమంత్రి రూ. 2.8 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న తరుణంలో ఈ విషాద వార్త విని మనసు కలిచివేసింది. చాలా బాధపడుతున్నాను. వెంకటేశ్వరుని సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదు. తిరుమల పవిత్రతను నిలబెట్టడం ఒక భక్తుడిగా, ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఈ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. మనం చేసిన పనుల వల్ల దేవుని పవిత్రత దెబ్బతినకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. రాజకీయాలకు అతీతంగా కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి సేవ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. క్రిస్టియన్లు జెరూసలేం, ముస్లింలు మక్కాకు వెళ్తారు. హిందువులు తిరుమల కొండకు వస్తారు. జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు అనుకుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తామని భక్తుల ప్రగాఢ నమ్మకం.’ అని సీఎం అన్నారు.

టోకెన్లు ఇచ్చే సంప్రదాయం గతంలో లేదు

‘ఎప్పుడూ లేని టోకెన్ల సంప్రదాయాన్ని గతంలో తెచ్చారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పవిత్రమైన రోజులు. వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలీదు. తిరుపతిలో టోకెన్లు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహంగా ఉన్నారు. మొదటి నుంచి ఉన్న సంప్రదాయాలను మార్చడం సరికాదు. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ పద్దతులు ఉండాలి. సంప్రదాయాలను ఉల్లంఘించడం సరికాదని అభిప్రాయ పడుతున్నా. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అపచారాలు జరగకుండా చర్యలు చేపడతాం. పర్వదినాల్లో శ్రీవారి దర్శనం చేసుకోవాలని భక్తులు బలంగా కోరుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించే బాధ్యత టీటీడీపై ఉంది.’ అని సీఎం తెలిపారు.

నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారుల సస్పెన్షన్… మరో ముగ్గురు బదిలీ

‘ఇలాంటి సమయాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కానీ కొందరు బాధ్యతారాహిత్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం. ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్‌ను బదిలీ చేస్తున్నాం. జరిగిన మొత్తం ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం. టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, జేఈవో సహా కొండపై అందరూ సమన్వయంతో పనిచేయాలి. దేవుని పవిత్రతకు భంగం కలిగించకూడదు. పెత్తందార్లుగా కాకుండా సేవకులుగా దేవుని సేవలో పాల్గొనాలి. తిరుమల పవిత్రతను కాపాడతానని మరోసారి చెబుతున్నాము. 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. 23 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంది. తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు కూడా తెలియదు. అక్కడ మరిన్ని జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది. తిరుమలలో ఉన్న తృప్తి.. తిరుపతిలో రాదని భక్తులు అంటున్నారు. గత ఐదేళ్లలో కొండపై చాలా అరాచకాలు జరిగాయి. కానీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తిరుమలకు వచ్చినప్పుడు నేను సామాన్య భక్తుడిగానే ఉంటా. వైకుంఠ ఏకాదశికి ఎన్ని టికెట్లు ఇవ్వాలనేదానిపైన నిర్ణయం తీసుకుంటాం.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

TOP STORIES