రాజకీయ నాయకులు బాగున్నారు – వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళ కుటుంభం గురించి ఆలోచిస్తున్నారు. ఎలక్షన్స్‌లో ఓడినా, గెలిచినా కోట్లే. వాళ్ళ బలం డబ్బు కాబట్టి అనునిత్యం దాని గురించే ఆలోచిస్తూ దర్జాగా కాలు మీద కాలు వేసుకొని బతుకుతున్నారు. ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచిస్తారు కాబట్టి 100కి 100 శాతం చాలా పర్‌ఫెక్ట్‌గా ఉన్నారు.
క్రికెటర్స్ బాగున్నారు – వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళ కుటుంభం గురించి ఆలోచిస్తున్నారు. రెగ్యులర్‌గా ఆడే క్రికెట్‌తో పాటు సైడ్ ఆదాయం కోసం IPL ఆడుతూ ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు. మొహమాట పడకుండా నా రేటు ఇంత అని చెప్పుకొని వాళ్ళ ధర వాళ్ళే నిర్ణయించుకొని అను నిత్యం తమని తాము మెరుగుపరుచుకుంటూ తమ గురించి, తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించే ఆలోచిస్తూ 100కి 100 శాతం పర్‌ఫెక్ట్‌గా ఉన్నారు.
సినిమా హీరోలు బాగున్నారు – వాళ్ళు కూడా వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు. సింహం సింగిల్‌గా వస్తుంది, పందులు మాత్రమే గుంపులు గుంపులుగా వస్తాయి అని సినిమా డైలాగ్స్ చెబుతారు. కానీ దాదాపు ప్రతి కుటుంబం నుంచి గుంపులు గుంపులుగా హీరోలు వస్తూ కోటాను కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ గురించి మాత్రమే కాకుండా వాళ్ళ స్నేహితులకి, వాళ్ళ కుటుంబాలకి సహాయం చేస్తూ రాజుల్లా బతుకుతున్నారు.
సామాన్యుడు మాత్రం తన గురించి ఆలోచించడంలేదు. ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయి.
1. సర్కిల్ ఆఫ్ కంట్రోల్ (మన నియంత్రణ వలయం): మన ప్రవర్తన, మన ఆరోగ్యం, మన సంపద, మన ఉద్యోగం, మనం ఏమి చదువుతున్నాం, మనం ఏమి చూస్తున్నాం, మనం ఏమి చేస్తున్నాం, మన నిద్ర, మన మైండ్‌సెట్, మన బలం, మన బలహీనత, మన లోపాలు, మన అపజయం, మన విజయం వంటివి. వీటి గురించి రోజులో 23 గంటల 50 నిమిషాలు సమయం కేటాయించాలి.
2. సర్కిల్ ఆఫ్ ఇన్ ఫ్లూయన్స్ (మన ప్రభావ వలయం): మన కుటుంబీకులు, మన ఇంటి పక్క పరిస్థితులు, మన స్నేహితులు, మన ఆఫీసులో వాతావరణం మొదలైనవి. వీటి గురించి పూర్తి ఎరుక, జాగరూకతతో ఉండాలి.
3. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ (మన బాహ్య వలయం): వాతావరణం, సినిమా నటులు, యుద్ధం, వార్తలు, క్రికెటర్లు, రాజకీయం, వేరే వాళ్ళ ప్రవర్తన, వేరే వాళ్ళ జీవితం మొదలైనవి. రోజులో 10 నిమిషాల కంటే ఎక్కువ వీటి గురించి ఆలోచించకూడదు. ఎందుకూ పనికి రాని వాళ్ళు.. మానసిక రోగులు మాత్రమే వారి సర్కిల్ ఆఫ్ కంట్రోల్ గురించి కాకుండా ఎక్కువ సమయం సర్కిల్ ఆఫ్ కన్సర్న్ గురించి ఆలోచిస్తారని ఒక అధ్యయనం చెబుతోంది.
ఏ మనిషి అయినా మొదట పట్టించుకోవాల్సింది వాళ్ళ గురించి మాత్రమే. రోజులో ఉన్న 24 గంటల్లో 23 గంటల 50 నిమిషాలు వాళ్ళ గురించే ఉండాలి. నేను ఒక సాఫ్ట్ వేర్ కూలీ. నా కూలి ఎంత, నేను ఏమి నేర్చుకొని నా జీతం పెంచుకోవాలి, ఏ టెక్నాలజీ నేర్చుకొని ప్రస్తుత యువత, మార్కెట్‌తో పోటీ పడాలి, నా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, నా ఆందోళనిని ఎలా నియంత్రించుకోవాలి, నా కుటుంబాన్ని ఇంకా గొప్పగా ఎలా చూసుకోవాలి, నా స్నేహితులకి నేను ఏమైనా సహాయం చేయగలనా లేదా నాకు ఎవరు సహాయం చేస్తారు, నేను ఎలా ఎదగాలి, నా బలం ఏంటి, నా బలహీనతలు ఏంటి తెలుసుకొని వీటి గురించి అంటే సర్కిల్ ఆఫ్ కంట్రోల్, మన కంట్రోల్ ఉన్న వాటి గురించి సమయం కేటాయించాలి.
అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు తీరిగ్గా వాతావరణం ఎలా ఉంది, ఏ సినిమా ఎలా ఉంది లేదా ఏ రాజకీయ నాయకుడు గెలిచాడు లేదా ఓడాడు అన్నది లేదా వేరే వాళ్ళ బలాలు/ బలహీనతలు ఆలోచన చేయాలి. అది కూడా రోజుకి 10 నిమిషాలు కంటె మించకూడదు. ఒకవేళ వాళ్ళ ఉద్యోగమే రాజకీయం లేదా సినిమా లేదా క్రికెట్ అయితే ఆయా వ్యక్తులు వాటి గురించి 23 గంటల 50 నిమిషాలు ఆలోచించాలి కారణం అది వాళ్ళ వృత్తి లేదా వారి సర్కిల్ ఆఫ్ కంట్రోల్.
ప్రస్తుతం ఎక్కువ మంది వాళ్లకి ఎందుకూ పనికి రాని ‘సర్కిల్ ఆఫ్ కన్సర్న్‘ గురించి ఎక్కువ ఆలోచించి సమయం వృధా చేసుకుంటున్నారు. నిజానికి ఇదొక మానసిక రోగం. ఎవరైనా వాళ్ళ గురించి, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సంపాదన, వారి చుట్టు పక్కల స్నేహితులు, కుటుంబీకుల గురించి ఆలోచిస్తూ తనని తాను ఎలా అభివృద్ధి చేసుకొని తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఎక్కువ సమయం కేటాయించాలి, ఇంకా తాను ఎలా ఉన్నత స్థితికి చేరుకోవాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
అలా కాకుండా తమ వృత్తిలో భాగం కాకపోయినా తన సర్కిల్ అవతల ఉన్న వాతావరణం, క్రికెట్, సినిమా వాళ్ళు, రాజకీయాల గురించి 10 నిమిషాల కంటే ఎక్కువ ఆలోచన చేస్తుంటే అదొక మానసిక రోగం. ఒకవేళ మీరు అభినవ మథర్ థెరిస్సా, పెరియార్, స్వామి వివేకానందలు అయితే మీ గురించి కాకుండా సంఘం గురించి ఆలోచన చేయొచ్చు.
కోవిడ్ కాలం తర్వాత ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక మానసిక రోగం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. నా అవగాహన అయితే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంది. తెలుసుకొని బయట పడటం ఉత్తమం.
– జగన్నాథ్ గౌడ్