తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. మంగళవారం రాత్రి తన నివాసం వద్ద జరిగిన ఘటన అనంతరం ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు.
“మనోజ్ నువ్వు నా బిడ్డవి. లక్ష్మీప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను. నువ్వు ఈరోజు నా గుండెల మీద తన్నావ్.. నా మనసు ఆవేదనతో కుంగిపోతోంది. నా బిడ్డ నన్ను తాకలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలు ఉంటాయి.
జల్ పల్లి ఇల్లు నా కష్టార్జితం.. నీకు సంబంధం లేదు. మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో ఎలాగో ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం మనోజ్ కు సరికాదు. ఇక చాలు నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు. నన్ను ఎవరూ మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపం. ఆస్తులు ముగ్గురికీ సమానంగా రాయాలా? వద్దా? అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా.. లేదా.. దాన ధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టం నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. మనోజ్ నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. తప్పు చేయనని చెప్పి మళ్లీ ఇంట్లోకి వచ్చావు. ఇక చాలు.. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం” అని పేర్కొన్నారు.