Andhrabeats

మాట వినలేదా? నచ్చలేదా? ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో ట్విస్టులు

Ap Ias, Ips officers Transfers

ఏపీలో భారీగా జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏరికోరి కీలక పోస్టుల్లో కూర్చోబెట్టిన కొందరు అధికారులను ఈ బదిలీల్లో అంతగా ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి పంపారు. పూర్తిగా జగన్‌ మనషులుగా ముద్ర వేసిన పలువురు అధికారులకూ పోస్టింగ్‌లు లభించాయి. అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే తమకు పనికి వచ్చేవారెవరో? అవసరం లేని వారెవరో? కూటమి పెద్దలు ఒక అంచనాకు వచ్చి ఈ బదిలీలు చేసినట్లు కనబడుతోంది. బాగా అంచనాలు పెట్టుకున్న అధికారులు కూడా తమకు నచ్చినట్లు పని చేయకపోవడం, చెప్పిన మాట వినకపోవడంతో మార్చక తప్పలేదు.

జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి సాయిప్రసాద్‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని చూసినా పలు కారణాల వల్ల కుదరలేదని చెబుతారు. అందుకే ఆయన్ను చంద్రబాబు తన దగ్గర పెట్టుకున్నారు. ముఖ్యమంత్రికి ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇకపై సీఎం కార్యాలయ కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. దీన్నిబట్టి సాయిప్రసాద్‌ తనకు కావాల్సిన వ్యక్తిని చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. అదే సమయంలో పియూష్‌కుమార్‌ని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి పోస్టు నుంచి తప్పించారు. ముఖేష్‌కుమార్‌ మీనా ఎన్నికల సమయంలో కూటమికి పూర్తిగా సహకరించిన అధికారిగా పేరుంది. ఈ నేపథ్యంలోనే అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే అత్యంత ప్రధానమైన మైనింగ్, ఎక్సైజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. తాజా బదిలీల్లో ఆయన్ను మైనింగ్‌ శాఖ బాధ్యతల నుంచి తప్పించారు.

కాటమనేని భాస్కర్‌ చంద్రబాబు కుటుంబానికి ఆప్తుడిగా పేరుంది. అందుకే ఆయనకు తన మానస పుత్రిక లాంటి రాజధాని వ్యవహారాలు నడపాల్సిన సీఆర్‌డీఏ కమిషనర్‌ పోస్టులో చంద్రబాబు నియమించారు. అయితే రాజధాని ప్రాజెక్టులను నడిపించేది మంత్రి నారాయణ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరూ ఇద్దరే. ఎవరికి వారే ఆధిపత్య భావజాలం కలిగిన వాళ్లు కావడంతో సహజంగానే పొసగలేదు. భాస్కర్‌ ఉంటే అమరావతి పనుల్ని తాను ముందుకు నడిపించలేనని చాలారోజుల క్రితమే చంద్రబాబుకు నారాయణకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగింది. దాని ఫలితమే తాజా బదిలీల్లో దగ్గరి మనిషైనా భాస్కర్‌కి బదిలీ బహుమానంగా దక్కింది. ఆయన స్థానంలో తాను చెప్పినట్టు నడుచుకునే, తన సామాజికవర్గానికి చెందిన కన్నబాబును నారాయణ సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి అనివార్య పరిస్థితుల్లో ఏపీకి వచ్చిన వాకాటి కరుణకు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పుడు ఆమెను అంత ప్రాధాన్యత లేని సెర్ప్‌ సీఈఓగా నియమించారు.

ముచ్చటపడి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అండ్‌ కమిషనర్‌ పోస్టుల్లో కూర్చోబెట్టిన ఎంవీ శేషగిరిబాబుపై అంతలోనే మొహం మొత్తడంతో ఆయన్ను తిరిగి మళ్లీ కార్మిక శాఖకు తిరుగుటపాలో పంపేశారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన సబ్‌ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ల రైటర్లు తమ జోలికి వచ్చిన వారిని ఊరికే వదిలిపెడతారా? పట్టుబట్టి శేషగిరిబాబును మార్పించేశారనే చర్చ నడుస్తోంది. సీపీడీసీఎల్‌ ఛైర్మన్, ఎండీగా ఉన్న రవి సుభాష్‌ను.. గాలికి వదిలేసిన ఎన్టీఆర్‌ వైద్య సేవ సీఈఓగా నియమించి ఆయన అవసరం పెద్దగా లేదన్నట్లు చూపించారు. గత ప్రభుత్వంలో చురుగ్గా పనిచేసిన రేవు ముత్యాలరాజు వంటి అధికారులకు ఈ బదిలీల్లోనూ పోస్టింగ్‌లు దక్కలేదు.

ఐపీఎస్‌ల బదిలీల్లోనూ ట్విస్టులు
ఐపీఎస్‌ అధికారుల బదిలీల్లోనూ ప్రభుత్వ ప్రాధామ్యాలు కొద్దిగా మారినట్లు కనబడుతోంది. జగన్‌ మనుషులుగా ముద్రవేసి ఏడు నెలలుగా పక్కనపెట్టిన జి పాలరాజు, పరమేశ్వరరెడ్డి, కృష్ణకాంత్‌ పటేల్, కేకేఎన్‌ అన్బురాజన్, బి.సత్య ఏసుదాసు, అట్టాడ బాబూజీకి తాజా బదిలీల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు.

కాకినాడ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ను కర్నూలు ఎస్పీగా, ప్రస్తుతం కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్న బిందు మాధవ్‌ను కాకినాడ ఎస్పీగా నియమించారు. వీరిద్దరూ టీడీపీకి అనుకూలమైన అధికారులుగా పేరుంది. తాము చెప్పినట్లు చేయడం లేదనే కారణంతో కొద్దిరోజుల క్రితం బదిలీ వేటు వేసిన హర్షవర్థన్‌రాజును తాజా పరిణామాల్లో తిరుపతి ఎస్పీగా నియమించారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో జాతీయ స్థాయిలో పరువు పోవడంతో సమర్థుడైన అధికారిని అక్కడ నియమించక తప్పలేదు. అక్కడ ఎస్పీగా పనిచేసిన సుబ్బరాయుడిపై వేటు వేసినా తమకు బాగా కావల్సిన అధికారి కావడంతో తిరుపతిలోనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా నియమించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులైన పి సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి వంటి వారికి ఇప్పుడు కూడా పోస్టింగ్‌లు దక్కలేదు.

 

TOP STORIES