రెడ్‌బుక్ తెరవగానే కొందరికి గుండెపోటు వచ్చిందని, కొంతమంది బాత్‌రూమ్‌లో జారిపడ్డారని ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ మరో 40 ఏళ్లు
టీడీపీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు. గల్లీ రాజకీయాలు చూశామని, ఢిల్లీ రాజకీయాలు శాసించామని, క్లైమోర్ మైన్స్‌కే భయపడలేదని, కామెడీ పీస్‌లకు భయపడతామా అని ప్రశ్నించారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా గెలుపు మనదేనని చెప్పారు. మూడు పర్యాయాలకు మించి ఒకే పదవిలో ఉన్నవారి స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలన్నారు. తనతోనే మార్పు మొదలుకావాలన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..
కరుడుగట్టిన పసుపు సైన్యమే మన బలం
43ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రత్యర్ధులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం. మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టిడిపి, జై చంద్రబాబు అంటూ ప్రాణాలొదిలిన చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలు మన పౌరుషం. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తమోడుతున్నా పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల లాంటి కార్యకర్తలు మన దమ్ము. 43ఏళ్లుగా పార్టీకి, పసుపు జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి నా పాదాభివందనం.
అరాచకానికి ఎదురొడ్డాం…ప్యాలెస్ లు బద్దలుగొట్టాం
2019 వరకూ మనం చూసిన రాజకీయం వేరు, 2019 నుండి 2024 వరకూ మనం చూసిన రాజకీయం వేరు. అయిదేళ్లు గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను మనం ఎదుర్కొన్నాం. మన దేవాలయంపై దాడి చేస్తే వెన్నుచూపకుండా ఎదురునిలబడ్డాం. మన అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడాం. క్లైమోర్ మైన్ల కే భయపడని బ్లడ్ మనది. కామిడీ పీసులకు భయపడతామా? నలుగురు ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం అన్నవారికి ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపాం. ప్యాలెస్ లు బద్దలు కొట్టాం. 2024 ఎన్నికల్లో మన స్ట్రయిక్ రేట్ 94 శాతం. 58 శాతం ఓట్ షేర్. 8 ఉమ్మడి జిల్లాలు క్లీన్ స్వీప్ చేశాం. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం ఓట్ షేర్ సాధించాం. ప్రజలు ప్రజా ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. వారి ఆకాంక్ష మేరకే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది.
కార్యకర్తలకు తగిన గుర్తింపునిస్తాం
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. ఈ మాట నేను ఊరికే అనడం లేదు. దేశంలో కార్యకర్తలకు గౌరవం ఇచ్చే ఒకే ఒక్క పార్టీ టిడిపి. మంచి చేస్తే మెచ్చుకుంటారు. తప్పు చేస్తే తాట తీస్తారు. కోటి సభ్యత్వాలు అనేది ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డు. దాన్ని మనం సాధించాం. కేవలం 83 రోజుల్లో కోటి సభ్యత్వాలు నమోదు చేశాం. ఏపీలో… 1 కోటి 53 వేల 551 సభ్యత్వాలు, తెలంగాణాలో… 1,78,041 సభ్యత్వాలు.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మొత్తం… 1 కోటి 2 లక్షల 35 వేల 857 సభ్యత్వాలు నమోదయ్యాయి. ప్రమాద బీమా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాం. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటివరకు సుమారు రూ.140 కోట్లు ఖర్చు చేసింది టిడిపి. కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తాం. 2004లో ఫ్యాక్షన్∙గొడవల్లో చనిపోయిన కార్యకర్తల పిల్లలను చదివించి ఉద్యోగాలకు వచ్చేవరకు నిలబడింది చంద్రబాబు. పాదయాత్రలో ఫ్యాక్షన్∙బాధిత కుటుంబాలను కలిశా. ప్రస్తుతం వారు వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయికి చేరారు. దేశ చరిత్రలో ఏ పార్టీలో అది జరగలేదు. అలాంటి నాయకుడు అధ్యక్షుడిగా ఉండటం మన అదృష్టం.
పనిచేసే వారికి ప్రమోషన్ ఇస్తా
కార్యకర్తల కోసం నేను బయట ఎంత పోరాడతానో పార్టీలో కూడా అంతే పోరాడతాను. నా లక్ష్యం ఒక్కటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులను గుర్తించడమే. గ్రామ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలి అనేది నా కోరిక. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. రెండు టర్మ్ లు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్ళాలి లేదా ఒక టర్మ్ గ్యాప్ అయినా తీసుకోవాలి. ఇది జరిగితే పార్టీలో కదలిక వస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా 4వససారి పనిచేస్తున్నా. పార్టీలో ప్రక్షాళన నాతోనే మొదలు పెట్టండి. యువకులకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక వస్తుంది. నా స్టయిల్ ఒక్కటే… సీనియర్లను గౌరవిస్తా … పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా. పార్టీ మరో నలభై ఏళ్లు బ్రతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలి. దానికి అందరి సహకారం కావాలి. పనిచేసిన వారికే పదవి అనేది నా విధానం. నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరిగే వారికే పదవులు ఇస్తాం. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తాం. త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నాం.