Andhrabeats

రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖుల చర్చలు

సంధ్య థియేటర్ ఘటన తర్వాత సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో పలువురు టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు, పలువురు సినీ ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సమన్వయంతో ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దలతో అన్న మాటలు ఇవే:

సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను. ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు అని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు. అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని అన్నారు. బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమ తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి. డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి అని కోరారు.
సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత ఉండాలి. హీరోలు బయట కూడా హీరోలుగానే మెలగాలి. హీరోలను ఆదర్శంగా తీసుకుంటారు అని అన్నారు. తమ ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సమావేశం తర్వాత నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ సినీ పరిశ్రమ పట్ల సీఎం తన విజన్ ను మాకు వివరించారు. తెలుగు సినీ పరిశ్రమకు అన్ని వర్గాల నుంచి అందాల్సిన గౌరవం అందుతుంది. ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాము అని తెలిపారు. తెలుగు సినిమాలే కాకుండా హైదరాబాద్ లో అన్ని భాషల సినిమాల షూటింగ్ లు జరగాలి. హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమా షూటింగ్ లకు అనుగుణంగా వసతులు కల్పించాలని కోరాము. సీఎం హైదరాబాద్ సినీ పరిశ్రమ ఒక హబ్ గా తయారు కావాలన్నారు. సానుకూల థృక్పథంతో సినీ పరిశ్రమ పనిచేయాలని చెప్పారు.
డ్రగ్స్ నివారణ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తాం. సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనేది అపోహ మాత్రమే. సినీ పరిశ్రమకు కావాల్సిన భద్రతపై డీజీపీతో చర్చించారు. పరిశ్రమ అభివృద్ధి మాత్రమే మా లక్ష్యం. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అంశం చాలా చిన్నది. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు FDC మధ్యలో ఉంటూ ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి పరిశ్రమ అభివృద్ధి కోసం 15 రోజుల్లో కమిటీ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్‌ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం.

నాగార్జున మాట్లాడుతూ హైదరాబాద్ లో యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలి. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అని తెలిపారు.

నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. హైదరాబాద్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లాలి అని అన్నారు.

సీనియర్ నటులు మురళి మోహన్ మాట్లాడుతూ ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం అని చెప్పారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలి అని అన్నారు.

TOP STORIES