చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని టీడీపీ నేతల డిమాండ్ల వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించే క్రమంలోనే టీడీపీ వ్యూహాత్మకంగా ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినట్లు జనసేన నేతలు భావిస్తున్నారు. అందుకే టీడీపీ కౌంటర్‌గా వారు పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలని, ఆ తర్వాత కావాలంటే లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేసుకోవచ్చనే వాదనను తెరపైకి తెచ్చారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో జరిగిన ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జరిగిన సభలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్‌ను చంద్రబాబు ఎదుట ఉంచారు. ఆ తర్వాత అదే డిమాండ్‌ను టీడీపీ నేతలు ముక్తకంఠంతో అన్ని ప్రాంతాల నుంచి ఒక ప్రచార కార్యక్రమంగా చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోసం వదులుకున్న ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ సైతం లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరడాన్ని బట్టి ఈ డిమాండ్ వెనుక రాజకీయ వ్యూహం దాగున్నట్లు స్పష్టమవుతోంది. పార్టీ క్యాడర్ గట్టిగా కోరుతోంది కాబట్టి తన కుమారుణ్ణి డిప్యూటీ సీఎంగా చేసే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా హవా చెలాయిస్తున్న పవన్ కళ్యాణ్‌కి చెక్ పెట్టే క్రమంలోనే టీడీపీ ఈ ఎత్తుగడ వేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉండి కూడా పలు అంశాల్లో పవన్ కళ్యాణ్ తరచూ తన వ్యతిరేకతను బయటపెడుతున్న విషయం తెలిసిందే. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృత్యువాతపడడాన్ని ఆయన ప్రభుత్వ తప్పిదంగా ఒప్పుకుని క్షమాపణ చెప్పారు. ఇందుకు టీటీడీ ఛైర్మన్, ఈఓ, అదనపు ఈఓ బాధ్యులని ప్రకటించి వారికి క్షమాపణ చెప్పాలని సూచించారు. మొదట టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇందుకు ఒప్పుకోకుండా పవన్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసినా ఆ తర్వాత చంద్రబాబు జోక్యంతో క్షమాపణ చెప్పారు. ఈ వ్యవహారంలో పవన్ వైఖరితో టీడీపీ ఇరుకునపడింది. కొద్దిరోజుల ముందు పిఠాపురంలో జరిగిన ఒక సభలో రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని, పోలీసులు సరిగా పనిచేయడంలేదంటూ హోంమంత్రి అనితపై విరుచుకుపడ్డారు. తరచూ ఇలా ప్రభుత్వంలో ఉంటూనే ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన విమర్శలు చేస్తుండడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది. జనసేన పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు టీడీపీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పవన్ ప్రాధాన్యతను తగ్గించి ఆయన దూకుడును అడ్డుకునే ఉద్ధేశంతో లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు పవన్ స్థాయిని తగ్గించడంతోపాటు రాజకీయంగా లోకేష్‌ని కూడా పవన్ పక్కన నిలబెట్టే వ్యూహం వున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రివర్గంలో ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్.. సీఎం తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యతను అందుకుంటున్నారు. లోకేష్‌ను రెండవ డిప్యూటీ సీఎం చేస్తే అది పలుచనై ఇద్దరూ సమాన స్థాయిలో ఉండడంతోపాటు పవన్ ప్రాధాన్యతను తగ్గించినట్లవుతుందని టీడీపీ నేతల యోచనగా ఉంది. ఇటీవల విశాఖలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలోనూ, తాజాగా గన్నవరంలో అమిత్‌షా పాల్గొన్న కార్యక్రమంలోనూ పవన్‌తో సమానంగా లోకేష్‌ను నిలబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు తెగ తాపత్రయపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు.
టీడీపీ డిమాండ్లతో జనసేన నేతలు విరుచుకుపడుతున్నారు. లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయడానికి తాము అంగీకరించేది లేదని జన సైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన జనసేన నేత విశ్వం రాయల్ టీడీపీ డిమాండ్లపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని అంటే తాము పవన్ కళ్యాణ్‌ని సీఎం చేయాలని కోరతామని చెప్పారు. కూటమి అధికారంలోకి రావడంలో ప్రముఖ పాత్ర పోషించిన పవన్‌కు సీఎం పదవి ఇవ్వడం సముచితమని చెప్పారు. పవన్ సీఎం అయ్యాక ఆయన మంత్రివర్గంలో కావాలంటే లోకేష్‌ని డిప్యూటీ సీఎంగా ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ఇందుకోసం చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సూచించారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య కొద్దిరోజులు మాటల తూటాలు పేలుతున్నాయి.