ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2– ది రూల్ చిత్రం కలెక్టన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలిరోజు వసూళ్లలో ఎన్టీఆర్, రామ్చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పేరుతో ఉన్న రికార్డును తుడిచిపెట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు సంచలనాలు సృష్టించగా ఇప్పుడు విడుదలయ్యాక మోత కలెక్షన్లలోనూ భారతీయ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.294 కోట్లు వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మైవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు ఏ భాషలోనూ, ఏ సినీ పరిశ్రమలోనూ ఈ స్థాయి కలెక్షన్లు లేవు. ఇండియన్ సినీ చరిత్రలో పుష్ప 2 మూవీ తొలి రోజున అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఘనత సాధించింది. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. ఆ సినిమా విడుదలైన తొలిరోజు రూ.223.5 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పుడు పుష్ప2 దీన్ని అధికమించింది.
గతంలో బాహుబలి 2 చిత్రం తొలిరోజు రూ.214 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించగా దాన్ని ‘ఆర్ఆర్ఆర్’ బ్రేక్ చేసింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును పుష్ప2 బ్రేక్ చేయడం విశేషం.
తొలిరోజు భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాలు
కల్కి 2898 – రూ.182 కోట్లు
సలార్ – రూ.165 కోట్లు
కేజీఎఫ్ : చాఫ్టర్2 – రూ.162 కోట్లు
దేవర : రూ.145 కోట్లు
లియో – రూ.142 కోట్లు
ఆదిపురుష్ – రూ.136 కోట్లు
జవాన్ – రూ.129 కోట్లు
రష్మిక కథానాయికగా నటించిన పుష్ప2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5 గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది.