గతంలో విజయం సాధించిన ’విడుదల–1’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రమే ‘విడుదల–2’. విజయ్ సేతుపతి హీరోగా వెట్రీమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుందా? లేదా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ: ’ప్రజాదళం’ నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పోలిసులు అరెస్టు చేయడంతో ఈ కథ మొదలవుతుంది. ఈ సినిమా పార్ట్–1 భాగాన్ని కూడా ఇక్కడే ఆపేశారు… మళ్లీ పెరుమాళ్ అరెస్టుతోనే పార్ట్–2 కథను మొదలుపెట్టారు. కుగ్రామంలోని పిల్లలకు చదువు చెబుతున్న పెరుమాళ్, జమీందారి వ్యవస్థను.. పెట్టుబడిదారుల అక్రమాలను .. అన్యాయాలను .. ఆగడాలను అడ్డుకునే క్రమంలో నాయకుడిగా మారతాడు.
ఈ తరుణంలో తనకు పరిచయమైన.. తన మనోభావాలకు దగ్గరైన మహాలక్ష్మీ (మంజు వారియర్) తో ప్రేమ, పెళ్లి ఆయనలో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది? పెరుమాళ్ బాటలోనే మహాలక్ష్మీ నడుస్తుందా? అహింస అంటే ఇష్టం లేని పెరుమాళ్ ఉద్యమాన్ని ఎలా నడుపుతాడు? పెరుమాళ్‌ను పట్టుకునేందుకు తోడ్పడిన సూరి చివర్లో ఏం చేస్తాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.
విశ్లేషణ: ‘విడుదల’ పార్ట్ 1కు మించిన సహజత్వంతో విడుదల–2 కథ నడుస్తుంది. కథ అంతా పెరుమాళ్ పాత్ర ప్రధానంగా కొనసాగుతుంది. పోలీస్ నిర్బంధంలో ఉన్న పెరుమాళ్ డీఎస్పీ సునీల్‌కు తన ఉద్యమ ప్రయాణంలోని ఫ్లాష్‌బ్యాక్‌ను చెప్పడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. జమీందారి వ్యవస్థ అణగారిన వర్గాల్ని ఎలా దోచుకుంది? ఎలాంటి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడింది? అనేది ఈ చిత్రంలో కరప్పన్ అనే పాత్ర ద్వారా ఎంతో హృద్యంగా చూపించారు.
కరప్పన్‌కు జరిగిన అన్యాయమే అప్పటివరకు పిల్లలకి పాఠాలు చెప్పే మాస్టర్‌గా ఉన్న పెరుమాళ్‌ను ఉద్యమం వైపుకు వెళ్లేలా చేసింది. ఈ సన్నివేశాలు చిత్రంలో అందరి హదయాలను బరువెక్కిస్తాయి. చక్కెర ఫ్యాక్టరీలో జరిగే కార్మికుల పోరాటం.. అక్కడే మహాలక్ష్మీ( మంజు వారియర్) తో పరిచయం..ఇలా ప్రతి సీన్‌ను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు.
ముఖ్యంగా ఆ కాలంలోని కమ్యూనిస్టు ఉద్యమాలు .. వారి సిద్దాంతాలు .. ఉద్యమాల కోసం వాళ్లు చేసే త్యాగాలు .. పర్యవసానాలు అన్ని దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పోరాట యోధులను, సామాన్యులను పోలీసులు ఎలాంటి కేసుల్లో ఇరిక్కిస్తారనేది కూడా చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు, పెరుమాళ్ దళ సభ్యులకు జరిగే కాల్పుల ఎపిసోడ్ సాగదీసినట్లుగా ఎక్కువ సమయం ఉండటం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. అయితే సినిమా పతాక సన్నివేశాలు మాత్రం అందరి హదయాలకు హత్తుకుంటాయి.
నటీనటుల పనితీరు: పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి నటన అత్యంత సహజంగా కొనసాగుతుంది. సినిమా మొత్తం ఆయన నటన ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రతి సన్నివేశంలో పెరుమాళ్ పాత్ర తప్ప, విజయ్ సేతుపతిని చూస్తున్న ఫీల్ కలగదు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మహాలక్ష్మీగా మంజు వారియర్ పాత్ర ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంది. ఆమె నటించినట్లుగా ఎక్కడా కనిపించదు. గౌతమ్ మీనన్, కన్నడ కిషోర్, సూరి పాత్రల నిడివి తక్కువైనా వాళ్ల పరిధుల మేరకు రాణించారు.
వెట్రీమారన్ రాసుకున్న ఈ కథలో పాత్రలు ఎంతో సహజంగా, సీరియస్‌గా ఉండటంతో సినిమా వేగం కాస్త నెమ్మదించినట్లుగా అనిపిస్తుంది. అయితే ప్రతి పాత్ర, సన్నివేశం ఎంతో సహజంగా, ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిన ఫీల్ కలుగుతుంది. ఇళయరాజా సంగీతం, నేపథ్య సంగీతం కథ మూడ్‌ను క్యారీ చేశాయి. దర్శకుడిగా వెట్రీమారన్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ఫైనల్‌గా వాస్తవిక అంశాలతో.. అత్యంత సహజంగా సాగే ఈ చిత్రం.. ఓ మోస్తరుగా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.