బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. క్లాస్ రూమ్‌లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కష్టపడి చదువుకోవాలని, చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా ఉన్నారు.
బాపట్ల మున్సిపల్ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నిరంతరం నేర్చుకోవడం ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించగలం. విద్యార్థులు ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుని కొత్త విషయాలు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిపి సమావేశాలు నిర్వహించడం దేశంలోనే తొలిసారి. ఒకేరోజు రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో ఈ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ సమావేశాల్లో దాదాపు 1 కోటి 20 లక్షల మంది తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొనడం సంతోషకరం. ఇకపై ప్రతి ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఈ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తాం’ అని తెలిపారు.
‘మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. చిన్నప్పుడు విద్యను నేర్పించిన గురువులను ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను ఇప్పటికీ చిన్నప్పుడు విద్య నేర్పించిన గురువులను గుర్తుచేసుకుంటూ ఉంటాను. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకుని రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు హెల్త్ కార్డులు, ప్రోగ్రెస్ కార్డులతో పాటు వారి అటిండెన్స్ సమాచారాన్ని ఫోన్ల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పిల్లలను గమనిస్తూ ఉండాలి. మీ పనుల్లో మీరు ఉండి పిల్లల చదువును నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు.
గంజాయి గురించి మాట్లాడుతూ ‘కొంతమంది ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్నారు. పెరట్లో కూరగాయ మొక్కల్లా పండిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశాం‘ అని చెప్పారు.