Andhrabeats

వైఎస్ భారతిపై ఐ టీడీపీ కార్యకర్త అసభ్య వ్యాఖ్యలు: గోరంట్ల మాధవ్ దాడి యత్నంతో ఉద్రిక్తత

ఏపీ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీకి ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత అతని అరెస్టుతో పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారింది.

కిరణ్ అడ్డగోలు వ్యాఖ్యలు
ఐ టీడీపీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న చేబ్రోలు కిరణ్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌లో వైఎస్ భారతిని ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ కి, ఆమెకి లింకుపెట్టి అసభ్య వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా జగన్, భారతి కుమార్తెల పైన కూడా సభ్య సమాజం తలదించుకునేలా కామెంట్లు చేశాడు. ఈ వ్యక్తిగత దాడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ నేతలు, అభిమానుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వైసీపీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో, “ఇది రాజకీయ ద్వేషాన్ని మించిన నీచమైన చర్య. చేబ్రోలు కిరణ్‌ను వెంటనే అరెస్టు చేయాలి” అని డిమాండ్లు వెల్లువెత్తాయి.కిరణ్ అసభ్య వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి నిరసనలు ఎత్తమవడంతో టిడిపి అధిష్టానం స్పందించింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కొందరు టీడీపీ నాయకులతో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయించి అతనిపై కేసు పెట్టించి అరెస్టు చేయించింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మంగళగిరి పోలీసులు కిరణ్‌ను అరెస్టు చేశారు. అతన్ని గుంటూరుకు తరలిస్తుండగా వైసిపి శ్రేణులు దాడికి ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

గోరంట్ల మాధవ్ దాడి యత్నం
చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు తరలిస్తున్న సమయంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కిరణ్‌పై దాడి చేసేందుకు మాధవ్ అతన్ని కాలుతో తన్నినట్లు సమాచారం. ఈ ఘటన గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ వద్ద జరిగింది. పోలీసులు వెంటనే మాధవ్‌ను అడ్డుకుని అదుపులోకి తీసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. హాయ్ అన్న ఎక్కడికి తరలించారు చెప్పకపోవడంతో వైసిపి నాయకులు, శ్రేణులు ఆందోళనకు దిగాయి.

వైసీపీ ఆగ్రహం
వైసీపీ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, “మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయాలకు మించిన సిగ్గుచేటు” అని వ్యాఖ్యానించారు. జగన్ అభిమానులు సోషల్ మీడియాలో #JusticeForBharathi హ్యాష్‌ట్యాగ్‌తో నిరసన తెలిపారు. ఈ ఘటన రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు, మహిళలపై అగౌరవ వ్యాఖ్యలపై కొత్త చర్చను రేకెత్తించింది.

కిరణ్ క్షమాపణ, తాజా పరిస్థితి
వివాదం తీవ్రతరం కావడంతో చేబ్రోలు కిరణ్ ఓ వీడియో విడుదల చేసి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ, వైసీపీ నేతలు దీనిని అంగీకరించకుండా, “క్షమాపణ సరిపోదు, చట్టపరమైన చర్యలు తప్పవు” అని పేర్కొన్నారు. ప్రస్తుతం కిరణ్, మాధవ్ ఇద్దరూ పోలీసు అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

టిడిపి దిద్దుబాటు చర్యలు
టీడీపీ నాయకత్వం ఈ ఘటనతో పార్టీకి సంబంధం లేదని, కిరణ్ వ్యక్తిగత వ్యాఖ్యలకు బాధ్యత వహించదని స్పష్టం చేసింది. అయితే, గోరంట్ల మాధవ్ చర్యలు వైసీపీ-టీడీపీ మధ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సంఘటన మరింత రాద్ధాంతానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

TOP STORIES