వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకేరోజు ఇద్దరు ముఖ్య నాయకులు రాజీనామా చేశారు. విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌లు జగన్‌ను వీడారు.
విశాఖలో గురువారం అవంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు తెలిపారు. జగన్ నిర్ణయాలను ఆయన తప్పు పట్టడం గమనార్హం. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాతీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కొత్త ఏర్పడిన ప్రభుత్వానికి సంవత్సరం సమయం ఇవ్వాలని, అలాకాకుండానే ఆర్నెళ్లు కాకముందే ధర్నాలు చేయాలని నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. నాయకులు, కార్యకర్తలు కష్టపడినా ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారని తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిల అభిప్రాయాలు తీసుకొని జగన్ పార్టీ కార్యక్రమాలను రూపొందించాలని, అలాకాకుండా ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అవంతి సూచించారు. అయితే, అవంతి ఏ పార్టీలో చేరతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు.
అవంతి రాజకీయ చరిత్ర
అవంతి శ్రీనివాస్ 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో అవంతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2019లో వైఎస్సార్‌పీలో చేరిన అవంతి, భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రిగా రెండున్నరేళ్లు పనిచేశారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున భీమిలి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. వైఎస్సార్‌సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అవంతి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పవన్‌ను ఓడించిన గ్రంధి జగన్‌ను వదిలేశారు
భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గురువారం తన రాజీనామా లేఖను జగన్‌కు పంపారు. గత ఎన్నికల్లో ఓటమి చెందాక ఆయన పార్టీ ప్రత్యక్ష కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు గ్రంధిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గెలిచినా గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. పవన్‌పై గెలిచినా తనకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వలేదని ఆయన అభిమానులు భావించేవారు. వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు గ్రంధి శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, భీమవరం నియోజకవర్గ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.