Andhrabeats

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో స్లాట్‌ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే విధానం ప్రారంభమైంది. శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుకింగ్‌ మాడ్యూల్‌ ద్వారా ఏ రోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి కొచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు తమకు కుదిరిన సమయాల్లో వచ్చి పని పూర్తి చేసుకోవచ్చన్నారు. స్లాట్‌ ఆధారిత అపాయింట్మెంట్లు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తాయన్నారు. ప్రస్తుతం మొత్తం 26 జిల్లా ప్రధాన కార్యాలయాల రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, మొత్తం 296 సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లో ఈ స్లాట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ దశలవారీగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే గాంధీనగర్, కంకిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేశామన్నారు. ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోందని తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌ విధానం ద్వారా అన్లైన్‌లో డేటా ఎంట్రీ చేసి డాక్యుమెంట్‌ ప్రీపేర్‌ చేసుకొని ఫీజు కూడా కట్టేసి ఆ తర్వాత స్లాట్‌ బుక్‌ చేసుకుంటే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వచ్చిన 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తయిపోతుందన్నారు. ఒక వేళ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోలేకపోయిన వారు సబ్‌ రిజిస్టార్‌ ఆఫీసుకు వస్తే సాయంత్రం ఐదు గంటల తర్వాత రిజిస్ట్రేషన్‌ చేస్తామన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా రూ. ఐదు వేల రూపాయల ప్రత్యేక ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పారు. ఉగాది, రంజాన్‌ పండుగల సందర్భంగా వరుసగా వచ్చిన మూడు రోజుల సెలవుల్లో దాదాపు రూ.74 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్‌ ఆదాయం లభించిందన్నారు.

మున్సిపాల్టీల్లో ఆటో మ్యుటేషన్లు
రిజిస్ట్రేషన్‌ తర్వాత ఆటో మ్యుటేషన్‌ సులభతరం చేయడం కోసం రిజిస్ట్రేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను రెవెన్యూ డేటాబేస్‌తో అనుసంధానం చేశామన్నారు. మున్సిపల్‌ తదితర శాఖలతోనూ అనుసంధానం ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రక్రియ 2025 ఏప్రిల్‌ 15వ తేదీ నాటికి పూర్తవుతుందని తెలిపారు. ఈ అనుసంధానంతో ఆస్తిపై యాజమాన్యం ఉన్న వ్యక్తి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయగలుగుతారని చెప్పారు. డబుల్‌ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్ల సృష్టి లాంటి రియల్‌ ఎస్టేట్‌ మోసాలను నివారించేందుకు శాఖ అనేక చర్యలు తీసుకుందన్నారు. డాక్యుమెంట్లను సమర్పించినప్పుడు పార్టీల డిజిటల్‌ సంతకాలు కూడా తీసుకోబడతాయన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న, భూ యజమానులకు ఇబ్బందిగా ఉన్న నాలా యాక్ట్‌ను రద్దు చేస్తున్నామన్నారు. నాలా యాక్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఏవైనా బకాయిలు, అపరాధ రుసుములు ఉంటే వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌ చేస్తామన్నారు. 2024–25 ఏడాదికి రిజిస్ట్రేషన్‌ ఆదాయం తగ్గిందని వార్తలు రాస్తున్నారని, అయితే డబ్బు కోసం గడ్డితినే ప్రభుత్వం మాది కాదని అన్నారు. పేదల అభ్యున్నతి తోపాటు, అభివృద్ధిని కూడా సాధిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం భూ అరచాకాలు చేసిందని, ఫ్రీ హోల్డ్‌ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని విమర్శించారు.

రెవెన్యూ శాఖ స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ ఆర్‌ పి సిసోదియా మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల శాఖలో వరుసగా తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా అవినీతి తగ్గిపోయి పారదర్శకత పెరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఫేస్‌ లెస్, పేపర్‌ లెస్, క్యాష్‌ లెస్‌ గా రిజిస్ట్రేషన్లు జరపాలనేది తమ లక్ష్యమని చెప్పారు.

స్లాట్‌ బుకింగ్‌ విధానం ఇలా
రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్‌ సైట్‌ registration.ap.gov.in లోని పబ్లిక్‌ డేటా ఎంట్రీ సిస్టమ్‌ ద్వారా డేటా అంతా ఎంట్రీ చేసి అప్లికేషన్‌ నెంబర్‌ను పొందాలి. ఆ తర్వాత స్లాట్‌ బుకింగ్‌ మాడ్యూల్‌లో అప్లికేషన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరోజు నుండి 15 రోజుల వరకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ 15 రోజుల్లో ఖాళీగా ఉన్న స్లాట్‌ను డైనమిక్‌ గా వైబ్‌ సైట్‌ ఎప్పుడూ చూపిస్తూ ఉంటుంది.

TOP STORIES