Andhrabeats

సినిమావాళ్లకు అంత దాసోహం ఎందుకు?

 

తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ తీరు మార్చుకోవడంలేదు. గేమ్‌ చేంజర్, డాకూ మహరాజ్‌ సినిమా టికెట్ల ధరలు పెంచుకోడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటించిన గేమ్‌ చేంజర్, నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న డాకూ మహరాజ్‌ సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు బెనిఫిట్‌ షోలు వేసుకోడానికి, టికెట్‌ రేట్లు పెంచుకోడానికి నిర్మాతలు అనుమతి కోరడం, తదనుగుణంగా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగిపోయాయి.

ఈ రెండు సినిమాలు ఏపీ ప్రభుత్వంలో భాగమైన వారి కుటుంబాలకు చెందినవే కావడం గమనార్హం. గేమ్‌ ఛేంజర్‌ మూవీలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అన్న, లెజండరీ హీరో చిరంజీవి కొడుకు రామ్‌ చరణ్‌ హీరో. డాకూ మహరాజ్‌ హీరో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు అవడంతోపాటు హిందూపురం ఎమ్మెల్యే. ఆయన సినిమాలకు రేట్లు పెంచుకోవడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చెందిన సినిమాలే కావడంతో ప్రభుత్వం చాలా అలవోకగా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతిచ్చేసింది.

కానీ తెలంగాణలో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది. హైదారాబాద్‌లో సంధ్యా థియేటర్‌ దుర్ఘటన తర్వాత బెనిఫిట్‌ షోలకు టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పేసింది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మడమ తిప్పలేదు. తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయారు. ఆ విషయంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు నుంచి ఒత్తిళ్లు వచ్చినా కూడా ఆయన రాజీ పడలేదు.

రేవంత్‌ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణ సర్కారును ఆదర్శంగా తీసుకొని అటువంటి నిర్ణయమే తీసుకోవాలని వివిధ వర్గాలు కోరాయి. మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కనపెడితే మన రాష్ట్ర ప్రభుత్వం చెవిన ఈ సూచనలు పడినట్టు లేదు.

హీరోలకు, ఇతర తారాగణానికి కోట్ల రూపాయలలో పారితోషకాలు ఇస్తూ.. అవసరం ఉన్నా.. లేకపోయినా భారీ సెట్టింగులు.. హంగులు సమకూరుస్తూ సినిమా నిర్మాణ వ్యయాన్ని నిర్మాతలు.. దర్శకులు ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తూ ఇప్పుడు సినిమా విడుదలయ్యే సమయానికి ఆ భారాన్ని జనాల నెత్తిన పడేసేందుకు వీలుగా టికెట్‌ రేట్లు పెంచుకోవడం.. బెనిఫిట్‌ షోలు వేసుకోవడం పరిపాటైపోయింది. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం కూడా అల్లు అర్జున్‌ సినిమా పుష్ప2కి అలాంటి సౌకర్యాలే సమకూర్చింది. అయితే సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మేలుకొని ఇకపై బెనిఫిట్‌ షోలకు గాని.. టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి గాని అనుమతి ఇచ్చేది లేదని నిక్కచ్చిగా చెప్పేసింది.

ఈ సందర్భంగానే సినిమాల నిర్మాణ వ్యయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఖర్చు అంత ఎక్కువగా పెంచుకోవడం దేనికి.. ఆనక ఆ భారాన్ని ప్రజల నెత్తిన వేయడం దేనికి..? ఒకవేళ వేసినా గాని గతంలో ఏదో బెనిఫిట్‌ షోలకి అనుమతి ఇచ్చేవారు గానీ ఇలా టికెట్‌ రేట్లను పెంచుకునే అవకాశం ఉండేది కాదు. సూపర్‌ స్టార్‌ కృష్ణ పద్మాలయ బ్యానర్‌పై ఆ రోజుల్లో సింహాసనం.. కురుక్షేత్రం.. అల్లూరి సీతారామరాజు వంటి సినిమాలను భారీ వ్యయంతో తీశారు. నిజం చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సందర్భంలో కృష్ణకు అప్పటి ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు సమకూర్చవచ్చు. కానీ అప్పుడు కృష్ణ అలా అడగలేదు.. అప్పటి ప్రభుత్వాలు ఇవ్వలేదు. అయితే జనాలు ఆ సినిమాను కనీవినీ ఎరుగని రీతిలో హిట్‌ చేసి కృష్ణకు లాభాల పంట పండించారు.

ఇప్పటి నిర్మాతల తీరే వేరు. అవసరం ఉన్నా లేకపోయినా భారీగా ఖర్చుపెట్టి తమ సినిమాలకు పాన్‌ ఇండియా హోదా తామే కల్పించుకుని పెట్టిన సొమ్మును మొదటి వారం పది రోజుల్లోనే వసూలు చేసుకునేందుకు బెనిఫిట్‌ షోలు వేయడం.. టికెట్‌ రేట్లను పెంచడం చేస్తున్నారు. ఇదంతా ఎవరిని ఉద్ధరించడానికి..? ఇప్పుడు టికెట్‌ ధర పెంచుకొని లబ్ధి పొందుతున్న సినిమాలేవీ కూడా సందేశాత్మక చిత్రాలు కావు. అలాగని అవి మహామహుల బయోపిక్‌లు అసలే కావు. ఇవన్నీ కూడా ఫక్తు వ్యాపార ధోరణితో తీసిన సినిమాలు. మరి వీటికి ప్రభుత్వాలు అన్ని రాయితీలు కల్పించవలసిన అవసరం ఏమిటో..?

పరిశ్రమలోని, ప్రభుత్వంలోని పెద్దలు ఇకనైనా ఇలాంటి అనుమతుల విషయంలో పునరాలోచన చేయడం సముచితం. ఇప్పటి సినిమాలు కళ అనే నిర్వచనానికి ఎప్పుడో దూరంగా జరిగిపోయి పూర్తి వ్యాపారంగా మారిపోయాయనేది చెప్పక తప్పని నిజం.

TOP STORIES