ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) కె.విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సాయంత్రం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సీఎస్‌గా పని చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను ఏపీ నూతన సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29న జీఓ జారీ చేసిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్ 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా తన ఉద్యోగ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1996 వరకు రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. 1996 నుండి గ్రామీణాభివద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1998 నుండి 2007 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాలకు జాయింట్ కలెక్టర్‌గా సేవలందించారు. 2007 నుండి 2008 వరకు ప్రణాళిక, కార్యక్రమాల అమలు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2008 నుండి 2009 ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2016 నుండి 2019 వరకు ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీగా రెండు బాధ్యతలు నిర్వర్తించారు.
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీ ఎన్నికల కమిషన్ సీఈఓగా బదిలీ అయ్యారు. 2021 వరకూ ఎన్నికల కమిషన్ ఎక్స్–అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. 2023 నుండి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ పని చేస్తున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఆ పోస్టులోనే కొనసాగుతున్నారు.
సీఎస్‌గా పదవీ విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్, బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా విజయానంద్‌కు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి. సాయిప్రసాద్, ఎంటీ కృష్ణబాబు, టీటీడీ ఈఓ శ్యామలరావు, జీఏడీ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఆయనకు అభినందనలు తెలిపారు.