Andhrabeats

సీనియర్‌ ఐఏఎస్‌ సిసోడియాపై వేటు

IAS Sisodia
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆర్పీ సిసోడియాకు కూటమి ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఆశిస్తున్న ఆయనకు ఉన్న కీలకమైన పోస్టును కూడా పీకేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూముల వ్యవహారాలకు సంబంధించిన అవకతవకలను బయటపెట్టడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఆశించిన విధంగా పని చేసిన ఆయన ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు వస్తుందని భావించారు. చంద్రబాబుకు కూడా అందుకు సుముఖంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆయనపై అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. ఆయన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు అవినీతి వ్యవహారాల్లో చిక్కుకున్నారు. సిసోడియా సూచనల మేరకే వారు లంచాలు తీసుకున్నట్లు ప్రభుత్వం భావించింది. అయితే వారిని పక్కకు తప్పించినా సిసోడియాను కొనసాగించింది. కానీ అప్పటికీ సిసోడియాపై ఆరోపణలు ఆగలేదు. భూములకు సంబంధించిన కీలక వ్యవహారాల ఫైళ్లను ఆయన తెప్పించుకుని సెటిల్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు వేసి రెవెన్యూ శాఖ నుంచి తప్పించారు. అప్రాధాన్యమైన చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా బదిలీ చేసింది. ఇప్పటివరకు ఆ పోస్టును అదనంగా నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎన్‌. యువరాజ్‌ను రిలీవ్‌ చేసి ఆ పోస్టుని సిసోడియాకు ఇచ్చింది. సిసోడియా స్థానంలో రెవెన్యూ బాధ్యతలను భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా (సీసీఎల్‌ఏ) ఉన్న జయలక్ష్మికి అప్పగించింది.  సిసోడియా అదనంగా నిర్వహిస్తున్న ఏపీ హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ డీజీ పదవి నుంచి కూడా తప్పించింది. ఆ పోస్టులో ఐటీ శాఖ కార్యదర్శిగా ఉన్న కాటంనేని భాస్కర్‌కు అదనంగా నియమించింది.

TOP STORIES