ఈ ఇంటర్నెట్ యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. భారీ లాభాల పేరుతో ఆశజూపడం లేదా డిజిటల్ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు గుంజుతున్నారు.
ఈ మోసాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మెసేజింగ్ ప్లాట్‌ఫాట్ ‘వాట్సప్’నే వినియోగిస్తున్నారట..! ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది.
వాట్సప్ వేదికగా స్కామర్లు ఎక్కువగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని హోంమంత్రిత్వ శాఖ (MHA) పేర్కొంది. ఆ తర్వాత ఈ జాబితాలో టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ఉన్నట్లు పేర్కొంది.
2023-24 సైబర్ మోసాల జాబితాను హోంశాఖ తాజాగా విడుదల చేసింది.
2024 తొలి మూడు నెలల్లో వాట్సప్ వేదికగా జరిగిన మోసాలకు సంబంధించి 43,797 ఫిర్యాదులు వచ్చినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. ఇక, టెలిగ్రామ్‌లో మోసాలపై 22,680, ఇన్‌స్టా వేదికగా జరిగే నేరాలపై 19,800 ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.
ఈ నేరాల కోసం గూగుల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌లను మోసగాళ్లు ఉపయోగిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని ప్రకటనలు చేసేందుకు గూగుల్ అడ్వర్టైజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఈ తరహా మోసాల కట్టడి కోసం తాము చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. డిజిటల్ లెండింగ్ యాప్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆయా సామాజిక మాధ్యమాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.
మోసాలు ఇలా జరుగుతాయి..
మీకు నెల నెల జీతమిచ్చే మీ యాజమానే.. అత్యవసరమని మిమ్మల్ని డబ్బు అడగవచ్చు. మీరు ఎంతగానే అభిమానించే నాయకుడి నుంచే 50 వేలు కావాలంటూ సందేశం రావచ్చు. అదేంటి వాళ్లు మమ్మల్ని ఎందుకు అడుగుతారనే కదా మీ సందేహం. రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగిని ఏకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సాయం కోరగా లేనిది.. మీకు తెలిసిన పెద్దలు డబ్బు పంపించమని వాట్సాప్‌లో అడగడంలో వింతేముంది చెప్పండి.
అందివచ్చిన సాంకేతికతను వాడుకుంటూ ఎప్పటికప్పుడూ సరికొత్త నేరాలకు తెర తీసే సైబర్ మోసగాళ్లు.. తాజాగా వాట్సాప్‌ను తమ అస్త్రంగా ఎంచుకుంటున్నారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు తదితరుల ఫొటోల నకిలీ ఖాతాలతో డబ్బు కావాలనే సందేశాలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫొటో, పేరు ఉన్న ఒక నెంబరు నుంచి వాట్సాప్ సందేశం రాగా.. అధికారులు ఆరా తీయగా ఆ నంబర్ రాజస్థాన్‌లో ఉన్నట్లు తేలింది.
ఏపీలోని గుంటూరులో విధులు నిర్వహిస్తున్న ఓ యువ ఐఏఎస్ అధికారి వాట్సాప్ ఖాతా నుంచి 20 వేలు కావాలంటూ కొంతమందికి సందేశాలు రావడం, వాళ్లు డబ్బు పంపించడం, సైబర్ నేరగాళ్ల పని అని ఆ తరువాత గుర్తించడం జరిగింది. తెలంగాణ, పంజాబ్, కేరళ, గోవా, తదితర రాష్ట్రాల్లో నకిలీ వాట్సాప్ ఖాతాలతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు నమోదు అవుతున్నాయి.
ఈ తరహా మోసాల్లో ఫొటోలు, పేర్లు అసలువే అయినా.. ఫోన్ నెంబర్లు మాత్రం అమాయకులవి కావడం విశేషం. ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే డబ్బులు పంపక, ఒకటికి రెండు సార్లు నిర్ధరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు